ఆంధ్రప్రదేశ్‌కి నీతి అయోగ్ కితాబు, సాయం చేసేదేమన్నా వుందా.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై నీతి అయోగ్ ప్రశంసలు గుప్పించేసింది. నీతి అయోగ్ బృందం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యింది. రాష్ట్రంలో వైఎస్ జగన్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్ని ప్రశంసించింది. గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయంటూ రాష్ట్ర ప్రభుత్వంపై పొగడ్తలు గుప్పించింది.

అయితే, ఇక్కడ నీతి అయోగ్ కేవలం ప్రశంసలతో సరిపెట్టడం వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం వుండదు. నీతి అయోగ్, రాష్ట్రానికి చాలా చాలా చేయాల్సి వుంది. గడచిన ఏడున్నరేళ్ళలో రాష్ట్రానికి కేంద్రం నుంచి అందిన సాయమేంటో నీతి అయోగ్‌కే బాగా తెలుసు.

ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయాక, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా తయారైంది. ఇక్కడ చంద్రబాబు పాలన మీదో, వైఎస్ జగన్ పాలన మీదో విమర్శలు చేసేస్తే సరిపోదు. అసలు సమస్య కేంద్రం అందించాల్సిన సాయం విషయంలో వుంది.

ప్రత్యేక హోదా విషయంలో నీతి అయోగ్‌ని సాకుగా చూపింది కేంద్రం. ప్రత్యేక ప్యాకేజీ విషయంలోనూ నీతి అయోగ్ పేరు చెప్పి తప్పించుకుంటోంది. రాజ్యసభ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన ప్రత్యేక హోదా ఎందుకు అందడంలేదన్న విషయమై నీతి అయోగ్ స్పష్టత ఇవ్వాల్సి వుంది.

రాష్ట్రానికి రాజధాని సహా చాలా విషయాల్లో కేంద్ర సాయం అవసరం. కానీ, కేంద్రం చేయాల్సిన రీతిలో రాష్ట్రానికి సాయం చేయడంలేదు. వున్న వనరుల్ని సద్వినియోగం చేసుకోవడం అలాగే అప్పులు తెచ్చుకుని రాష్ట్రాన్ని ముందుకు నడపాల్సి వస్తోంది.. అధికారంలో ఎవరున్నా.

కేంద్రం, ఆంధ్రప్రదేశ్ మీద పెద్ద మనసు చేసుకుని ఇతోదికంగా సాయం అందిస్తే తప్ప, రాష్ట్రంలో అభివృద్ధి అనే మాట కనిపించదు. అది తెలియనంత అమాయకత్వం నీతి అయోగ్ బృందంలో ఎవరికీ వుండకపోవచ్చు.