ఓవైపు టీడీపీ నేతలపై వరుస అరెస్ట్ లు ఆ పార్టీ నేతల్ని కవలవర పెడుతున్నాయి. అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి అరెస్ట్ లతో తేదాపా నేతల్లో టెన్షన్ పీక్స్ లో ఉంది. వైకాపా నేతల హెచ్చరికలతో అరెస్ట్ లు ఇంకా ఉంటాయనే క్లారిటీ వచ్చేసింది. దీంతో ఎటు నుంచి ఏ అధికారులు దాడులు చేసి అరెస్ట్ చేస్తారో? అన్న టెన్షన్ తేదాపా నేతల్లో కొనసాగుతోంది. ఇప్పటికే పార్టీకి చెందిన కొంత మంది కీలక నేతల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. జగన్ హిట్ లిస్ట్ లో చాలా మందే ఉన్నారని తెలుస్తోంది. గతంలో వాళ్లు పాల్పడిన కుంభ కోణాలపై ప్రత్యేక కథనాలు అంతే వేడెక్కిస్తున్నాయి.
ఇవన్నీ చూస్తుంటే అవినీతికి పాల్పడ్డ ఏ నేతని జగన్ సర్కార్ వదిలే లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా తేదాపా మాజీ మంత్రి, పలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్న పాత్రుడుపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు అయింది. విశాఖపట్టణం జిల్లా నర్సీపట్నం పట్టణ సీ ఐ స్వామినాయుడు మంగళవారం రాత్రి అయ్యన్న పై కేసు నమోదు చేసారు. నర్సీపట్నం పురపాలక కమీషనర్ కృష్ణ వేణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. పురపాలక కార్యాలయంలోని మాజీ సర్పంచి రత్తుల లచ్చాపాత్రుడు చిత్ర పటం తొలగింపు విషయంపై తనను ఉద్దేశించి అభ్యంతరకరంగా, అసభ్యంగా ప్రవర్తించారని కృష్ణావేణి ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీంతో అయ్యన్నపై నిర్భయ కేసు ఫైల్ చేసినట్లు సీఐ తెలిపారు. ఇప్పటికే తేదాపా నేతలపై జోరుగా పోలీసు కేసులు నమోదువుతున్నాయి. ఓ వైపు అక్రమాలకు సంబంధించిన కేసులుంటే, మరోవైపు మహానాడు సందర్భంగా లక్ డౌన్ రూల్స్ ని ఉల్లంఘించినందుకు పలువురు నేతలపై కేసులు నమోదయ్యాయి. అటు వైకాపా వర్సెస్ టీడీపీ వార్ నేపథ్యంలో నేతలు ఇరువురిపైనా కేసులు నమోదవుతున్నాయి. ఇందులో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు. తాజాగా అయ్యన్నపై అందరికంటే బలమైన కేసు నమోదైనట్లు తెలుస్తోంది.