ప్రస్తుత కాలంలో భార్యాభర్తలు చిన్న చిన్న విషయాలకు కూడా గొడవ పడుతూ ఉంటారు . ఈ క్రమంలో కొంతమంది మహిళలు అలిగి పుట్టింటికి వెళ్ళిపోతుంటే మరి కొంతమంది మహిళలు మనస్థాపనతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా ఇటువంటి విషాద ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య వచ్చిన గొడవల కారణంగా భార్య నీటిలో దూకి ఆత్మహత్య చేసుకోగా.. ఆమెను కాపాడడానికి నీటిలో దూకిన ఆమె సోదరుడు కూడా మరణించాడు.దీంతోరెండున్నర ఏళ్ల బాబు అమ్మకోసం పరితపించిన ఘటన స్థానికులను కలచివేసింది.
వివరాలలోకి వెళితే… పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పాకాలపాడు గ్రామానికి చెందిన శానంపూడి హరినాథ్‌రెడ్డి అనే వ్యక్తికి కృష్ణవేణి అనే మహిళతో నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. ప్రస్తుతం వారికి రెండున్నరేళ్ల బాబు ఉన్నాడు. అయితే సంవత్సరం క్రితం జరిగిన ప్రమాదంలో హరినాథ్ రెడ్డి కాలు విరిగిపోయింది. అప్పటినుండి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఇక ఇటీవల ఈ గొడవలు పెద్దవి కావటంతో 15 రోజుల క్రితం కృష్ణవేణి తన కుమారుడిని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది.
దీంతో హరినాథ్ రెడ్డి 15 రోజులుగా ఇంట్లో ఒంటరిగా ఉండటంతో తన భార్యతో మాట్లాడి ఇంటికి తీసుకురమ్మని చెప్పి తనకి బావ వరుస అయిన వెంకటరమణారెడ్డిని తన భార్య పుట్టింటికి పంపించాడు. వెంకటరమణారెడ్డి కృష్ణవేణి పుట్టింటికి వెళ్లి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి ఆమెని ఆమె కొడుకుని ద్విచక్ర వాహనం మీద హరినాథ్ రెడ్డి దగ్గరికి తీసుకు వస్తున్నాడు. ఈ క్రమంలో మండల పరిధిలోని నార్నెపాడు రోడ్డు వద్ద గల గుంటూరు బ్రాంచి కాలువ వద్దకు రాగానే ఆమె బైకు ఆపమని చెప్పి వెళ్లి కాలువలో దూకింది.
దీంతో వెంకటరమణారెడ్డి బాబు నీ ద్విచక్ర వాహనం మీద కూర్చోపెట్టి వెంటనే ఆమెను కాపాడటానికి నీటిలో దూకాడు. అయితే నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో ఇద్దరూ నీటిలో మునిగి మరణించారు. ఇది గమనించిన స్థానికులు వెంకటరమణారెడ్డి మృతదేహాన్ని వెలికితీయగా కృష్ణవేణి మృతదేహం గల్లంతు అయింది. అయితే తన తల్లి కనిపించకపోవడంతో ఆ బాబు తల్లి కోసం ఆరాటపడుతూ అమ్మ అమ్మ అంటూ ఏడవటంతో స్థానికుల గుండెలు బరువెక్కిపోయాయి.