గవర్నర్‌ను కలవనున్న నిమ్మగడ్డ.. అస‌లు కార‌ణం ఇదే..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకున్న సంగ‌తి తెలిసిందే. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి వినతీ పత్రం సమర్పించాల్సిందిగా నిమ్మగడ్డను ఏపీ హైకోర్టు ఆదేశించింది. త‌న కేసుల విష‌యంలో హైకోర్టు తీర్పు ఇచ్చినా, ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీ స‌ర్కార్ తనను ఎస్ఈసీగా నియమించకపోవడం పై, మ‌రోసారి నిమ్మ‌గ‌డ్డ‌ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.

ఈ నేప‌ధ్యంలో గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి, హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని కోరాల్సిందిగా నిమ్మ‌గ‌డ్డ‌కు హైకోర్టు సూచించింది. ఈ క్ర‌మంలో నిమ్మ‌గ‌డ్డ గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌వాడ‌నికి అపాయింట్‌మెంట్ కోర‌గా.. ఆయ‌న‌కు సోమ‌వారం ఉద‌యం 11.30 గంటలకు గ‌వ‌ర్న‌ర్‌ను కలవాలని గవర్నర్ కార్యాలయం నిమ్మగడ్డకు స్పష్టం చేసింది. మ‌రి సోమ‌వారం నిమ్మ‌గ‌డ్డ, గ‌వ‌ర్న‌ర్‌ను క‌లువ‌నున్న నేప‌ధ్యంలో ఆయ‌న, నిమ్మ‌గ‌డ్డ భ‌విష్య‌త్తు పై ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.