ఆంధ్రప్రదేశ్ వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కేసు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల అనంతపురం పోలీసులు అతడిపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన కేసును నమోదు చేయగా, తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే, ఈ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించడంతో మరో ఎదురుదెబ్బ తగిలింది.
గురువారం జరిగిన విచారణలో, బోరుగడ్డ అనిల్ పై ఇప్పటికే నేరచరిత్ర ఉందని పోలీసులు హైకోర్టుకు వివరించారు. గతంలో దాఖలు చేసిన రెండు కేసుల్లో చార్జ్ షీట్‌లను సమర్పించినట్టు తెలిపారు. ఈ నేపధ్యంలో న్యాయమూర్తి నిందితుడి వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. ‘సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా? ఇలాంటి వారిని క్షమించడానికి అవకాశం ఉండదని వ్యాఖ్యానించారు.
బోరుగడ్డ అనిల్ పై గత ప్రభుత్వ హయాంలో అనేక ఆరోపణలు వచ్చాయని, ఐదేళ్ల పాటు తన ప్రవర్తన అశాంతికి కారణమైందని పోలీసులు తెలిపారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించిన అనిల్, టీడీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో కలకలం రేపాడని ఆరోపించారు. తన రాజకీయ సంబంధాలను వినియోగించుకుని అనేక వేధింపులకు పాల్పడినట్టు వివరించారు. న్యాయస్థానం బోరుగడ్డ అనిల్ పిటిషన్‌ను తిరస్కరించడంతో వైసీపీ నేతలకు ఇది దారుణమైన ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఈ కేసు పరిణామాలు వైసీపీ వర్గాల్లో కలకలం రేపుతూ, సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారితీస్తున్నాయి.