నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలిందని, నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల అధికారిగా కొనసాగించాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో నిమ్మగడ్డను ఎస్ఈసిగా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ ఆదేశించడం కూడా జరిగిపోయిందని కొన్ని చానళ్ళలో బ్రేకింగ్ వార్తలు ప్రసారం అవుతున్నాయి.
ఇక ఇటీవల హైకోర్టు ఆదేశాలు మేరకు నిమ్మగడ్డ గవర్నర్‌ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్, తన సమస్యలను చాలా ఓపికతో విన్నారని, దీంతో ఈ వ్యవహారం పై సానుభూతితో పరిశీలిస్తానని గవర్నర్ హామీ ఇచ్చారని, నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీడియా ముఖంగా తెలిపారు. అయితే ఈరోజు నిమ్మగడ్డను తిరిగి ఎస్ఈసీగా నియమించాలని, ఏపీ సర్కార్‌కు గవర్నర్ ఆదేశించారంటూ కొన్ని చానళ్లలో బ్రేకింగ్ వార్తలు జోరుగా ప్రచారం చేస్తున్నారు.
అయితే ఇక్కడ ఇంట్రస్టింగ్ మ్యాటర్ ఏంటంటే.. ఇంతటి కీలకమైన ఈ సమాచారాన్ని రాజ్‌భవన్ వర్గాలు బహిరంగంగా ఎందుకు వెల్లడించలేదనేది, రాజకీయవర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. అంతే కాకుండా మొదటి నుండి నిమ్మగడ్డకు వంత పాడుతున్న చానళ్ళలోనే ఈ వార్తలు రావడం అనుమానం కలిగిస్తోంది. ఈ క్రమంలో గవర్నర్ నిజంగానే నిమ్మగడ్డను తిరిగి ఎస్ఈసీగా తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారా లేక కొన్ని చానళ్ళ అత్యుత్సాహమా అనేది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా కొన్ని నెలలుగా రాజకీయవర్గాల్లో రచ్చ లేపిన నిమ్మగడ్డ వ్యవహారం, ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.