తిరువనంతపురం : కేరళలో ఇద్దరు ఉగ్రవాదులను భారత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోమవారం అరెస్ట్ చేసింది. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లష్కరే తోయిబా, ఇండియన్ ముజాహిదీన్ కు చెందిన ఉగ్రవాదులను ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకున్నది. వీరిలో ఒకరు కన్నూర్‌కు చెందిన షుహైబ్ కాగా, మరొకరు ఉత్తర ప్రదేశ్ కు చెందిన వ్యక్తి.
ప్రస్తుతం పట్టుబడిన షుహైబ్ 2008 లో బెంగళూరు పేలుడు కేసులో నిందితుడు. ఢిల్లీలో హవాలా కేసులో కూడా పాల్గొన్నాడు. అతనితోపాటు ఇతర ఉగ్రవాదుల కోసం ఎన్‌ఐఏ లుకౌట్ నోటీసు జారీచేసింది. సౌదీ అరేబియాలోని రియాద్ నుంచి తిరువనంతపురం విమానాశ్రయానికి చేరుకున్న ఈ ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కేరళ, కర్ణాటకలో ఐసిస్ ఉగ్రవాదులు “గణనీయమైన సంఖ్యలో” ఉన్నారని పేర్కొన్న ఐక్యరాజ్యసమితి నివేదికను ప్రభుత్వం తిరస్కరించిన మరుసటి రోజే ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్ కావడం విశేషం. లోక్ సభలో నివేదికపై లేవనెత్తిన ప్రశ్నకు స్పందిస్తూ, హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నివేదిక గురించి ప్రభుత్వానికి తెలుసు అని చెప్పారు. అయితే, కేరళ, కర్ణాటకలో ఐసిస్ ఉగ్రవాదులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారని పేర్కొన్న నివేదిక వాస్తవానికి సరైనది కాదు అని ఆయన పేర్కొన్నారు.
ఈ ఏడాది జూలైలో ఐసిస్, అల్-ఖైదా, ఇతర అనుబంధ వ్యక్తులు, సంస్థలకు సంబంధించిన విశ్లేషణాత్మక మద్దతు, ఆంక్షల పర్యవేక్షణ బృందం యొక్క 26 వ నివేదిక పేరుతో ఐక్యరాజ్య సమితి ఒక నివేదికను ప్రచురించింది. కేరళ, కర్ణాటకలో ఐసిస్ ఉగ్రవాదులు “గణనీయమైన సంఖ్యలో” ఉన్నారని ఈ నివేదికలో పేర్కొన్నది.