గన్నవరంలో ఉపఎన్నికలు పెడితే వంశీకి టికెట్ ఇవ్వకూడదట 

గన్నవరంలో ఉపఎన్నికలు పెడితే వంశీకి టికెట్ ఇవ్వకూడదట
గత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం వైఎస్ జగన్ గాలి వీచినా కొన్ని చోట్ల మాత్రం టీడీపీ జెండా ఎగిరింది.  వాటిలో గన్నవరం నియోజకవర్గం కూడా ఒకటి.  వల్లభనేని వంశీ వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ మీద గెలిచి పసుపు జెండా ఎగురవేశారు.  ఆ తర్వాత కొన్ని నెలలకే టీడీపీ నుండి దూరం జరిగిన వంశీ వైసీపీకి దగ్గరయ్యారు.  నేరుగా ముఖ్యమంత్రిని కలిసి అనధికారికంగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.  ప్రస్తుతం ఆయన పేరుకు టీడీపీ ఎమ్మెల్యేనే అయినా మద్దతు మొత్తం వైసీపీకే.  కొన్నిరోజుల క్రితం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్యకు చెల్లని ఓటు వేసి తాను ఇకపై టీడీపీ వ్యక్తిని కాదని తేల్చేశారు.  అంతేకాదు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉపఎన్నికల్లో వైసీపీ టికెట్ మీద గెలిచి అధికారికంగా ఆ పార్టీలో చేరి పోవాలనే ఆలోచన కూడా వంశీలో ఉంది. 
 
కానీ ఈ ఆలోచనకు వైసీపీ నుండే ఆటంకం ఏర్పడుతోంది.  వంశీ వైసీపీకి దగ్గరవుతుండగానే యార్లగడ్డ వర్గీయులు గతంలో వంశీ తమను ఇబ్బందిపెట్టారని, ఆయన్ను పార్టీలోకి తీసుకోవడం తమకు ఇష్టం లేదని జగన్ వద్ద చెప్పుకోగా యార్లగడ్డకు నామినేటెడ్ పోస్టు ఇచ్చి సర్డిచెప్పారు.  కానీ ఇప్పుడు మరొక వర్గం వంశీకి వ్యతిరేకంగా తయారైనట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.  అదే దుట్టా రామచంద్రరావు వర్గం.  వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడైన దుట్టా వర్గం గుట్టుచప్పుడు కాకుండా వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా పావులు కదుపుతోందట.  వంశీ ప్రాభవాన్ని తగ్గించే ప్రయత్నాల్లో ఉందట. 
 
ఉపఎన్నిక అంటూ జరిగితే వైసీపీ నుండి టికెట్ వంశీకి ఇవ్వకూడదని, తమకే ఇవ్వాలని పట్టుబడుతున్నారట.  ఈమేరకు వారంతా మంత్రి పెద్దిరెడ్డిని కలిశారని ప్రచారం జరుగుతోంది.  కానీ దుట్టా వర్గం మాత్రం అలాంటిదేం లేదని, నియోజకవర్గ అభివృద్ది కోసమే మంత్రిని కలిశామని అంటున్నారు.  ఒకవేళ దుట్టా వర్గం టికెట్ తమకే ఇవ్వాలని పట్టుబట్టడం నిజమే అయితే వంశీకి ఇబ్బందే.  ఒకవేళ అధిష్టానం రాజీనామా చేసి పార్టీలో చేరవచ్చు కానీ టికెట్ ఇవ్వమని అంటే మాత్రం వంశీ ఖచ్చితంగా రివర్స్ అవుతారు.  ఎందుకంటే పదవి లేకపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఆయనకు తెలుసు కాబట్టి.