కేంద్రాన్ని టార్గెట్ చేసి పెద్ద ట్విస్టే ఇచ్చిన జగన్ సర్కార్ 

Reddy community request to CM YS Jagan
ప్రత్యేక హోదా.. ఆంధ్రులకు తప్పక అమలుకావాల్సిన హామీ.  రాష్ట్ర విభజన సమయంలో అన్యాయం జరిగిందని ఆక్రోశించిన ఆంధ్రా జనానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా హామీని ఇచ్చింది.  కొత్త రాష్ట్రాన్ని ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని అభివృద్దికి గొప్పగా సహకరిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.  ఆ హామీని ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమైతే ఆ హామీని కోరింది, సమర్థించింది భారతీయ జనతా పార్టీ.  ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పోయి బీజేపీ సర్కార్ ఏర్పడింది.  హోదాను రెకమండ్ చేసింది బీజేపీనే కాబట్టి ఇక హోదా వచ్చేయడం ఖాయమని ఆంధ్రా ప్రజలు ఆశపడ్డారు.  కానీ బీజేపీ ప్లేటు పిరాయించింది.  హోదా ఇవ్వలేము ప్యాకేజీ మాత్రమే ఇస్తామని అడ్డం తిరిగింది.  ఇప్పటికీ ఈ అంశం మీద ఒక క్లారిటీ లేదు.  ఎదురుచూసి చూసి జనం కూడా విసిగిపోయారు.  అన్ని రాజకీయ పార్టీలు అవసరాన్ని బట్టి హోదా అంశాన్ని వాడుకున్నాయి తప్ప చిత్తశుద్ధితో పోరాడిన వారు ఒక్కరూ లేరు. 
 
దీంతో జనం సైతం హోదాను లైట్ తీసుకున్నారు.  కానీ రాజకీయ పార్టీలు మాత్రం ఇప్పటికీ హోదా అంశాన్ని ఉపయోగించుకుంటూనే ఉన్నాయి.  విభజన చట్టాలు సరిగా అమలుకావడం లేదని న్యాయవాది పీవీ కృష్ణయ్య పిటిషన్ దాఖలు చేశారు.  ఈ పిటిషన్ విచారణకు రాగా రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాల్సి వచ్చింది.  దాఖలు చేసింది కూడ.  ఈ అఫిఫవిట్లో విభజన హామీల అమలుపై అభిప్రాయం ఇవ్వాల్సి ఉండగా ఏపీ ప్రభుత్వం మాత్రం మూడు రాజధానుల గురించి ప్రముఖంగా ప్రస్తావించింది.  రాష్ట్ర రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశమని, కేంద్రం కూడా తన అఫిడవిట్‌లో ఇదే విషయాన్ని తేల్చి చెప్పిందని ప్రభుత్వం గుర్తు చేసింది.  వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాల తర్వాత ఈ అంశాలు సమీక్షార్హం కాదని, కార్యాలయాల తరలింపుపై లేవనెత్తిన అంశాలు న్యాయ సమీక్షకు అర్హం కాదని అఫిడవిట్లో వెల్లడించింది.  అభివృద్ధి ప్రణాళిక, వివిధ ప్రాజెక్టుల సమీక్షాధికారం రాష్ట్రానికి ఉందని తెలిపింది.  
 
అలాగే చివర్లో అసలు పాయింట్ ప్రత్యేక హోదాను గురించి మాట్లాడుతూ హోదా ఇస్తామన్న కేంద్రం ఇంకా ఇవ్వలేదని, ప్రతి భేటీలోనూ హోదా విషయాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నామని, విభజనలో హోదా అంతర్భాగమని, అది పూర్తయ్యేవరకు విభజన ప్రక్రియ పూర్తికానట్టేనని పేర్కొంది.  ఇలా ఉన్నట్టుండి కేంద్రం తీరుకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొనడం ప్రజెంట్ హాట్ టాపిక్ అయింది.  ఈ పరిణామానికి బీజేపీ సైతం ఖంగుతిని ఉండాలి.  ఎందుకంటే ఇన్నిరోజులు కేంద్రం హోదా విషయంలో ఎన్ని దోబూచులాడినా జగన్ సర్కార్ పెద్దగా పట్టించుకోలేదు.  ఏదో డిమాండ్ చేయాలి కాబట్టి డిమాండ్ చేస్తూ వచ్చింది తప్ప ఏనాడూ గట్టిగా అడగలేదు.  కేంద్రం సైతం ఏపీ సర్కార్ అన్ని విషయాల్లో అనుకూలంగా ఉండటం, ప్రతి బిల్లుకు మద్దతుగా ఓటు వేస్తుండటంతో ఇక హోదా విషయంలో కూడా తమ మాటే నెగ్గుతుందని, ఎలాంటి వ్యతిరేకత ఉండదని అనుకుంది. 
 
కానీ ఉన్నట్టుండి రాష్ట్ర ప్రభుత్వం హోదా ఆలస్యానికి, విభజన హామీలు అసంతృప్తిగా మిగిలిపోవడానికి కారణం కేంద్రమే అనడంతో జగన్ మోదీ నెత్తినే నెపం మొత్తం నెట్టేసినట్టు అయింది.  ఈ వ్యాఖ్యలతో పరోక్షంగా హామీలను కేంద్రం విస్మరించిందని అన్నారు జగన్.  మరోవైపు మోదీ సర్కార్ హోదా ఇవ్వలేమని కావాలంటే ప్యాకేజీ ఇస్తామని తెగేసి చెప్పారు.  ఇలా పరస్పర విరుద్దంగా ఉన్న అభిప్రాయాలతో కేంద్రానికి, రాష్ట్రానికి ఫైట్ జరగాల్సిందే.  అయితే ఆ ఫైట్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అంకితభావం మీద ఆధారపడి ఉంటుంది.  నిజంగానే జగన్ సర్కారుకి హోదా సాధన పట్ల అంకితభావమే ఉండి ఉంటే ఈపాటికి వార్ మొదలై ఉండాలి.  కానీ కాలేదు.  మరిప్పుడు కేంద్రాన్ని వేలెత్తి చూపిస్తున్న సర్కార్ ఇకమీదటైనా పోరాటం చేస్తుందేమోనని అనుకుందామంటే గ్యారెంటీ కనిపించట్లేదు.  ప్రభుత్వం కేవలం తమ తప్పేమీ లేదని చెప్పుకోవడానికే ఈ తరహా వ్యాఖ్యలు చేసిందని, అంతేకానీ వాటికి కొనసాగింపుగా ఎలాంటి పోరాటాలు ఉండబోవని కొందరు అభిప్రాయపడుతున్నారు.  మరి ఈమధ్య తమ మీద చిన్న కామెంట్ పడినా గట్టిగా కౌంటర్ ఇస్తున్న ఏపీ బీజేపీ ఈ అఫిడవిట్ మీద ఎలా స్పందిస్తుందో చూడాలి.