ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులకు ఈ నెల నుంచి వేతనాలు పెరిగాయనే సంగతి తెలిసిందే. భారీగా వేతనాలు పెరగడంతో గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులు సంతోషిస్తున్నారు. ప్రొబేషన్ ఖరారయ్యాక తొలి జీతం అందుకున్న ఉద్యోగులకు క్షేత్రస్థాయి ఉద్యోగులు షాకిస్తున్నారు. ఒక్కో ఉద్యోగి నుంచి 1000 రూపాయల వరకు క్షేత్రస్థాయి ఉద్యోగులు వసూలు చేస్తున్నారని సమాచారం అందుతోంది.
అనంతపురం, శ్రీకాకుళం, పల్నాడు, గుంటూరు జిల్లాలలోని పలు ప్రాంతాలలో ఈ వసూళ్ల పర్వం కొనసాగుతోందని సమాచారం అందుతోంది. ఏపీలో అవినీతి ఉండదని జగన్ చెబుతుంటే ప్రభుత్వ ఉద్యోగులే లంచం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుండటం గమనార్హం. ఏపీలో ఇలాంటి విచిత్రమైన పరిస్థితి ఏర్పడటంతో వైసీపీ సర్కార్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏమిటని కామెంట్లు వినిపిస్తున్నాయి.
డబ్బులు వసూలు చేసిన క్షేత్రస్థాయి ఉద్యోగులపై జగన్ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ఖజానా శాఖ కార్యాలయాలలో పని చేసే కొందరు ఉద్యోగులు సైతం జీతాలను ప్రాసెస్ చేయడానికి ఉద్యోగుల నుంచి 500 రూపాయల చొప్పున వసూలు చేశారని సమాచారం అందుతోంది. మేము అడిగినంత లంచం ఇవ్వకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు పెడతామని క్షేత్రస్థాయి ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులను హెచ్చరిస్తున్నారని తెలుస్తోంది.
పెరుగుతున్న ఖర్చుల వల్ల ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నామని ఈ విధంగా డబ్బులు వసూలు చేస్తే ఎలా జీవనం సాగించాలని కొందరు సచివాలయ ఉద్యోగులు మీడియా ఎదుట వాపోతున్నారు. వసూళ్ల బెదిరింపులకు సంబంధించి కొందరు సచివాలయ ఉద్యోగులు ఎంపీడీవోలకు ఫిర్యాదు చేశారని సమాచారం. అక్రమ వసూళ్లపై జగన్ సర్కార్ చర్యలు తీసుకోకపోతే జగన్ సర్కార్ పై ప్రతిపక్షాలతో పాటు ఉద్యోగుల నుంచి కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యే ఛాన్స్ అయితే ఉంది.