మంత్రి గుమ్మనూరు జయరాం, అయన కుమారుడు ఈశ్వర్ మీద వస్తున్న ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో సంచనలం రేపుతున్నాయి. మంత్రి కుమారుడు గత కొన్ని రోజులుగా ఓ ఖరీదైన బెంజ్ కారుతో సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు. కారుతో ఫొటోలు దిగి నిత్యం సోషల్ మీడియాలో ఫొటోలు ఉంచుతున్నారు. దీంతో ఆ బెంజ్ కారు ఆయనకు ఎలా వచ్చింది అనే విషయమై ఆరా తీసిన ప్రత్యర్థి వర్గాలు ఆ కారు మంత్రి కుమారుడి పేరు మీద లేదని, ఈఎస్ఐ స్కాంలో ఏ 14 నిందితుడిగా ఉన్న తెలకపల్లి కార్తీక్ అనే వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయి ఉందని, కానీ కారు మాత్రం మంత్రి కుమారుడు వాడుతున్నారని.. అంటే ఆ కారు ఆయనకు బహుమతిగా అందిందనే ఆరోపణలు లెవనెత్తారు.
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అయితే ఇంకో అడుగు ముందుకేసి ఆ ఏసీబీకి ఫోన్ చేసి ఈఎస్ఐ స్కాం నందు నిందితుడిగా ఉన్న కార్తీక్ అనే వ్యక్తి నుండి మంత్రి కుమారుడు బెంజ్ కారును అందుకున్నారని, అది బహుమానం కాదని లంచమని, ఈఎస్ఐ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి నుండి కారును ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, అంటే స్కాములో మంత్రి కుమారుడి ప్రమేయం ఉందనే అనుమానం ఉందని అన్నారు. అంతేగాక ఆధారాలతో సహా మంత్రి అవినీతిని నిరూపిస్తానని సవాల్ చేశారు. కేవలం మంత్రి కుమారుడిని తప్పించడానికే ఎలాంటి తప్పూ చేయని అచ్చెన్నాయుడును ఇరికించారని అన్నారు.
అంతేకాదు అవినీతి జరిగిందని పిర్యాధు చేస్తే 24 గంటల్లో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం అంటోంది. మరి మంత్రి, అయన కుమారుడి మీద ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని జగన్ సర్కారును ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. దీనికి తోడు ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి జయరాం డిఫెన్స్ టీడీపీ ఆరోపణలకు ఇంకా ఊతమిస్తోంది. మంత్రి జయరాం ఆ కారు తన కుమారుడిదని నిరూపిస్తే తాను పదవికి రాజీనామా చేస్తానని, తన కుమారుడు ఆ కారు ముందు నిలబడి ఫొటోలు మాత్రమే దిగాడని అంటున్నారే తప్ప ఆ కారుకు డబ్బు చెల్లించిన ఈఎస్ఐ స్కాంలో నిందితుడు కార్తీక్ విషయాన్ని మాత్రం ప్రస్తావించడం లేదు. అతనితో తన కుమారుడికున్న పరిచయం మీద మాట్లాడటం లేదు. దీంతో టీడీపీ నేతలు కావాలనే అచ్చెన్నాయుడును ఇరికించి మంత్రి కుమారుడిని తప్పించారని అంటున్నారు. మొత్తానికి మంత్రి కుమారుడి బెంజ్ కారు ముచ్చట ప్రభుత్వాన్ని కొత్త తలనొప్పి తెచ్చిపెట్టినట్టైంది.