New Districts New Jobs : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయసుని 62 ఏళ్ళకు పెంచాక, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎలా వస్తాయ్.? ఏమోగానీ, కొత్త జిల్లాలతో మాత్రం సరికొత్తగా ఉద్యోగాలు వచ్చేస్తాయంటూ విద్యార్థులు నినదిస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఆయా జిల్లాల్లో ఆందోళనలు నెలకొన్న విషయం విదితమే.
ప్రధానంగా రాజంపేట కేంద్రంగా అన్నమయ్య జిల్లా కావాలంటూ ఉద్యమం ఉధృతమవుతోంది. వేల సంఖ్యలో విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు. వీళ్ళందరిదీ ఒకటే మాట.. కొత్త జిల్లాల ఏర్పాటుతో కొత్త కొత్తగా ఉద్యోగాలు వస్తాయట. అలా రాజంపేట కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటైతేనే తమకు ఉద్యోగాలు వస్తాయన్నది అక్కడ ఆందోళన చేస్తున్న విద్యార్థుల వాదనగా కనిపిస్తోంది.
అసలు ఇలాంటి మాటలు ఎవరు విద్యార్థులకి నేర్పిస్తున్నట్టు.? కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆయా జిల్లాలకు కలెక్టరేట్లు, ఇతర కార్యాలయాలూ వస్తాయి. కానీ, ఉద్యోగుల సంఖ్య పెరుగుతుందా.? సర్దుబాట్లు మాత్రమే జరుగుతాయి. ఉద్యోగుల సంఖ్య పెరిగితే, వారి వేతనాల్ని భరించే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఇది బహిరంగ రహస్యం.
కొత్తగా ఉద్యోగాలు కల్పించి, వారికి వేతనాల్ని చెల్లించడం కష్టం కనకనే, ఆయా శాఖల్లో ఖాళీలు వున్నాసరే, ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడంలేదు. ఇది వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే కాదు, అంతకు ముందూ జరిగింది. కాంట్రాక్టు ప్రాతిపదికన.. ఔట్ సోర్సింగ్ విధానంలో మాత్రమే ఉద్యోగాల్ని భర్తీ చేసే ప్రక్రియ నడుస్తోంది.
ఏదిఏమైనా, కొత్త జిల్లాల ఏర్పాటుతో అద్భుతాలు జరిగిపోవు.. అలాగని తీవ్రమైన నష్టమూ వాటిల్లిపోదు. ఇదే వాస్తవం.