ప్రత్యేక హోదాపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. రెండేళ్ళపాటు వేచి చూసిన ఆంధ్రపదేశ్‌లోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కేంద్రం నుంచి ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలు కన్పించకపోవడంతో, కేంద్రంపై ఒత్తిడి పెంచాలనే నిర్ణయానికి వచ్చింది. పార్లమెంటు సాక్షిగా వైసీపీ ఎంపీలు, ప్రత్యేక హోదాపై నినదించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతూనే ప్రత్యేక హోదా నినాదాలతో హోరెత్తడం ఆహ్వానించదగ్గ పరిణామమే. నిజానికి, పోరాటం చాలా చాలా ఆలస్యమైపోయింది.
టీడీపీ అధికారంలో వున్నప్పుడు, వైసీపీ.. ప్రత్యేక హోదా కోసం ఉద్యమించింది.. వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారు కూడా. కానీ, వైసీపీ అధికారంలోకి వచ్చాక పూర్తిగా ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పడేశారు. అందుక్కారణం, కేంద్రంలో బీజేపీకి పూర్తి స్థాయి బలం వుండడమే. ఇప్పుడూ బీజేపీ బలానికి వచ్చిన నష్టమేమీ లేదుగానీ, ప్రత్యేక హోదాపై పోరాటం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.? అన్న భావన కాస్త లేటుగా వైసీపీలో కలిగిందని అనుకోవచ్చు. అంతా బాగానే వుందిగానీ, ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మెడల్ని వంచేంత సత్తా వైసీపీకి వుందా.? అన్నదే ఇక్కడ అసలు సిసలు ప్రశ్న. పోరాడితే పోయేదేం లేదు బానిస సంకెళ్ళు తప్ప.. అన్న చందాన, అధికార వైసీపీ.. పోరుబాట పట్టడమే నిజమైతే, ఖచ్చితంగా ఆ పోరాటం మంచి ఫలితాన్ని సాధిస్తుంది. అయితే, సొంత పోరాటం కంటే, సమిష్టి పోరాటమే మెరుగైన ఫలితాన్నిస్తుందని వైసీపీ గుర్తించాలి. రాజకీయాల్ని పక్కన పెట్టి, రాష్ట్రంలో రాజకీయ శక్తులన్నిటినీ ఒక్కతాటిపైకి తెచ్చి, అధికార పార్టీగా పెద్దన్న పాత్ర పోషించి, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. కానీ, అది ఆంధ్రపదేశ్ రాజకీయాల్లో సాధ్యమయ్యే పనేనా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.