మాజీ మంత్రి, సీఎం వైఎస్ జగన్ సమీప బంధువు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే. వివేకా కుమార్తె సునీత సీబీఐ విచారణ డిమాండ్ చేస్తూ హైకోర్టులో వేసిన పిటిషన్ విచారణకు రాగా కేసును సీబీఐకు అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. దీంతో సీబీఐ అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటివరకు రెండు దశల్లో వివేకా పీఏతో పాటు డ్రైవర్, కొందరు టీడీపీ నేతలు, గతంలో వివేకా వద్ద తమ వ్యక్తిగత గొడవలను పంచాయితీ చేసుకున్న వ్యక్తులను విచారించి కీలక ఆధారాలు సేకరించారు. విచారణ వేగం పుంజుకుంటోంది అనుకునే సమయానికి దర్యాప్తు బృందంలోని ఏడుగురికి కరోనా సోకడంతో దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేశారు.
దీంతో ఇప్పుడప్పుడే విచారణ తిరిగి మొదలుకాదని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సోకినా బృందానికి తాత్కాలికంగా విశ్రాంతి ఇచ్చి కొత్త బృందాన్ని దింపుతూ సీబీఐ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే స్పెషల్ టీమ్ దిగుతుందని తెలుస్తోంది. ఎక్కడైతే విచారణ ఆగిపోయిందో అక్కడి నుండి ఈ స్పెషల్ టీమ్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టనుంది. సీబీఐ వేగం చూస్తుంటే ఇంకొన్ని నెలల్లోనే కేసులో నిజాలను రాబట్టి నిందితులను కటకటాల వెనక్కి పంపడం ఖాయమనే నమ్మకం కలుగుతోంది.
హత్యకు గురైంది జగన్ బంధువు కాబట్టి పెద్ద దుమారమే లేచింది. మొదటి గుండెపోటుతో బాత్రూంలో కాలుజారిపడి చనిపోయారని ప్రాథమిక సాక్షులు చెప్పగా ఆతర్వాత వివేకాను గొడ్డలితో నరికి చంపిన నిజం బయటికొచ్చింది. సరిగ్గా ఎన్నికల సమయంలో జరిగిన ఈ హత్య వైసీపీ, టీడీపీ మధ్య మంటను రాజేశాయి. జగన్ సీబీఐ విచారణ డిమాండ్ చేయగా చంద్రబాబు సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆతర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ పాత సిట్ బృందాన్ని తీసేసి కొత్త బృందాన్ని ఏర్పాటుచేశారు కానీ సీబీఐ వరకు వెళ్ళలేదు. అయితే వివేకా కుమార్తె, భార్య సీబీఐ విచారండిమాండ్ చేస్తూ కోర్టుకు వెళ్లడంతో న్యాయస్థానం సీబీఐను రంగంలోకి దిగమని ఆదేశాలిచ్చింది.