భారత్ క్రికెట్ జట్టులో ఇప్పుడు అవకాశం రావడం చాలా అదృష్టం. ఒక్క మ్యాచ్ ఛాన్స్ వచ్చిన చాలా గ్రేట్ అన్న చందంగా మారింది. రాక రాక వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటే మంచి భవిష్యత్ ఉంటుంది . లేదంటే మళ్ళీ ఎదురు చూపులు తప్పవు. అయితే పృథ్వీషాకు అతి తక్కువ సమయంలోనే భారత క్రికెట్ జట్టులో ఆడే అవకాశం దక్కింది. రోహిత్ శర్మ లాంటి ఓపెర్స్ గైర్హాజరుతో మనోడికి తరచు ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. కాని చక్కగా ఉపయోగించుకున్న సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి.
ఈరోజు ఆడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఓపెనర్‌గా దిగిన పృథ్వీ షా రెండు బాల్‌లు ఆడి డకౌట్‌గా వెనుదిరిగాడు. స్టార్క్ వేసిన గుడ్ లెంగ్త్ డెలివరీని అంచనా వేయడంలో పొరబడ్డ పృథ్వీ బ్యాట్ పైకెత్తడంతో బంతి వెళ్లి నేరుగా వికెట్లను గిరాటేసింది. టెస్ట్ మ్యాచ్‌లలోను ఇలా వచ్చి అలా వెళ్లడంతో నెటిజన్స్ కోపం కట్టలు తెంచుకుంది. మనోడిని ఇష్టమొచ్చినట్టు ఏకిపారేస్తున్నారు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో చక్కగా ఆడిన శుభ్‌మన్ గిల్‌ని పక్కన పెట్టి నీకు ఛాన్స్ ఇస్తే ఇలానా ఆడేది అంటూ తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు.
ప్రాక్టీస్ మ్యాచ్ అయిన టెస్ట్ మ్యాచ్ అయిన ఒకటే ఆట ఆడతావా, వరుసగా ఆఫర్స్ ఇస్తున్నప్పటికీ నీ ఆట తీరు మార్చుకోవా, అసలు నీకు అవకాశాలు ఇచ్చి దండగ, పోయి ఇంట్లో కూర్చో అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచని పక్షంలో మనోడికి ఇప్పట్లో ఛాన్స్ కూడా ఇవ్వరు. కాగా టీమిండియా మొదటి రోజు పూర్తయ్యే సరికి ఆరు వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో అశ్విన్, సాహా ఉన్నారు. విరాట్ కోహ్లీ 74 పరుగుల వద్ద రనౌట్ కావడంతో మ్యాచ్ మొత్తం ఆస్ట్రేలియా చేతిలోకి వచ్చేసింది. రెండో రోజు భారత బ్యాట్స్‌మెన్స్ ఎన్ని పరుగులు చేస్తారో చూడాలి