నేరాంధ్రప్రదేశ్.. ఆంధ్రప్రదేశ్‌పై పగపట్టేశారేంటి.?

నేరాంధ్రప్రదేశ్.. అంటూ మీడియాలో వచ్చిన కథనాల పట్ల సగటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ‘అప్పుల కుప్పగా మారిన ఆంధ్రప్రదేశ్.. అప్పులాంధ్రపదేశ్..’ అంటూ నిన్న మొన్నటిదాకా రాజకీయ విమర్శలు చూశాం. రాజకీయ నాయకులు.. రాజకీయ విమర్శలే చేస్తారు. ఎవరు అధికారంలో వున్నా అది మామూలే. కానీ, మీడియా.. పనిగట్టుకుని ఆంధ్రప్రదేశ్ మీద దుష్ప్రచారం చేయడమేంటి.? జాతీయ స్థాయిలో నేరాలకు సంబంధించి ఓ నివేదిక బయటకు వచ్చింది. అందులో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో వుంది.? గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది నేరాలు తగ్గాయా పెరిగాయా.? ఇలాంటి అంశాలపై చర్చ సంగతెలా వున్నా, ‘నేరాంధ్రప్రదేశ్’ అంటూ మీడియా చేస్తున్న దుష్ప్రచారం అత్యంత హేయం. నిజమే.. నేరాల సంఖ్య పెరుగుతోంది.. ఇది దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితి.

ప్రపంచ వ్యాప్తంగానూ ఇదే దుస్థితి. కారణం, నేరాలు నమోదవుతుండడమే. గతంలో నేరాల నమోదు తక్కువగా వుండేది.. ఇప్పుడు జరుగుతున్న నేరాలు.. వాటి నమోదు.. పెరుగుతోంది. సాంకేతికతను పోలీసు వ్యవస్థ అందిపుచ్చుకోవడంతో.. నేరాల నమోదు తేలికైంది. దాంతో, నేరాల సంఖ్య పెరిగినట్లు కనిపించడం వింతేమీ కాదు. అలాగని, దీన్ని లైట్ తీసుకోలేం కూడా. ఖచ్చితంగా నేరాల్ని అదుపు చేయాల్సిందే. నేరాలు పెరుగుతున్నాయంటే.. అది పాలకుల వైఫల్యంతోపాటు, సమాజంలో ప్రతి ఒక్కరి వైఫల్యంగానూ భావించాల్సి వుంటుందనే వాదన లేకపోలేదు. ఇక, వైసీపీ అనుకూల మీడియాలో అయితే నేరాల సంఖ్య తగ్గినట్లుగా చెబుతుండడం గమనార్హం. నేరాల అదుపుకి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. అవి అదుపులోకి రావడంలేదు సరికదా, సరికొత్త నేరాలు పెరుగుతున్నాయి. అంత మాత్రాన.. నేరాంధ్రపదేశ్ అనో, నేర తెలంగాణ అనో.. నేర భారతం అనో.. అనడం ఎంతవరకు సబబు.?