Nellore Pedda Reddy : నెల్లూరు పెద్దారెడ్డి అనగానే, మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డే గుర్తుకొస్తారెవరికైనా. ఆనం బ్రదర్స్‌లో ఒకరైన వివేకానందరెడ్డి అగ్రెసివ్ రాజకీయాలు చేసేవారు. బోల్డంత ఫన్ జనరేట్ చేసేవారాయన.
అదే సమయంలో డైనమిక్ నాయకుడు కూడా. ఆనం రామనారాయణరెడ్డి అలా కాదు. చాలా సైలెంట్. డిగ్నిఫైడ్‌గా కనిపిస్తారు.
వివేకా మరణం తర్వాత, రామనారాయణరెడ్డి రాజకీయం ఒకింత డల్ అయిన మాట వాస్తవం. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి, ఆ తర్వాత వైసీపీలోకి.. ఇలా సాగుతోంది ఆయన రాజకీయ ప్రయాణం. మంత్రి పదవి వస్తుందనుకున్నారుగానీ.. రాకపోయేసరికి డీలాపడ్డారు. అలాగని వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎదిరించలేరు.
అందుకే, వ్యూహం మార్చారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీద సెటైర్లు వేసేందుకు తాజా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పంచన చేరారు. నెల్లూరుని ఉద్ధరించాలంటే అది కాకాని వల్లనే సాధ్యమవుతుందన్నారు. మూడేళ్ళుగా నెల్లూరు పెద్దగా బాగుపడిందేమీ లేదని అనిల్ మీద సెటైర్లేశారు.
‘పూటకో పార్టీ మార్చేవాళ్ళ గురించి నేనేంటి మాట్లాడేది.?’ అంటూ అనిల్, ఆనంపై గుస్సా అయ్యారనుకోండి.. అది వేరే సంగతి. ఈ మొత్తం వ్యవహారంపై అధిష్టానం స్పెషల్ షోకస్ పెట్టాల్సి వుంది. ఎందుకంటే, వైసీపీకి నెల్లూరు కూడా అత్యంత కీలకమైన జిల్లా.
అలాంటి జిల్లాలో ఈ రాజకీయ రచ్చ.. వైసీపీ కొంప ముంచే అవకాశాల్లేకపోలేదు. ఆనం తనతోపాటు ఎవరన్నా బయటకు వస్తే.. వాళ్ళను తీసుకెళ్ళిపోవడానికి రెడీ.. లేదంటే, తనదైన రాజకీయాలతో ఎవర్నయినా వదిలించుకునేందుకు (పార్టీ నుంచి బయటకు పంపేందుకు) కూడా వెనుకాడేలా లేరు.