Neha Sharma : ‘తెరపై లిప్ టు లిప్ కిస్ సీన్‌లో నటించారు కదా.? అది నిజమా.? ఉత్తుత్తిదేనా.?’ అని హీరోయిన్లను పాత్రికేయులు ప్రశ్నించడం కొత్తేమీ కాదు. అందులో తప్పు లేనప్పుడు, ‘హీరోయిన్ శరీరంపై ఎన్ని పుట్టుమచ్చలున్నాయో తెలుసుకున్నారా.?’ అని ప్రశ్నిస్తే తప్పేంటట.? ఈ చర్చ సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో జరగడానికి కారణం, ‘డిజె టిల్లు’ సినిమా ప్రెస్ మీట్ సందర్భంగా జర్నలిస్టు వ్యవహరించిన తీరు కారణంగానే.
ఎవరా జర్నలిస్టు.? అన్న విషయాన్ని పక్కన పెడితే, పుట్టుమచ్చల వ్యవహారం హీరోయిన్‌కి ఇబ్బంది కలిగించే అంశంమే. తెలుగు రాకపోవడంతో పాపం హీరోయిన్ నేహా శెట్టి వెంటనే ఆ ప్రశ్నను అర్థం చేసుకోలేకపోయింది. హీరో జొన్నలగడ్డ సిద్ధుకి మాత్రం విషయం అర్థమయ్యింది, చాలా జెంటిల్‌గా టాపిక్ డైవర్ట్ చేసేశాడు.
కానీ, విషయం అర్థమయ్యాక హీరోయిన్ నేహా శెట్టి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. మీడియా తీరుపై మండిపడింది సోషల్ మీడియా వేదికగా. దాంతో నిర్మాత నాగ వంశీ, హీరోయిన్ నేహా శెట్టికి క్షమాపణ చెప్పాడు. సోషల్ మీడియా వేదికగా చాలామంది సదరు హీరోయిన్‌కి బాసటగా నిలుస్తున్నారు.
ఈ మధ్య తెలుగులో వస్తున్న సినిమాలు, వాటిలోని కంటెంట్.. ఓటీటీ వ్యవహారం.. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే, పరిస్థితి చెయ్యిదాటిపోయింది. ఎంత జుగుప్సాకరమైన అంశమైనప్పటికీ సర్వసాధారణమైన వ్యవహారంలా మారిపోయింది. అయినాగానీ, నటన వేరు, వాస్తవ జీవితం వేరు. ఓ మహిళ పట్ల అలాంటి చెత్త ప్రశ్న ఎలా వేయగలిగారో ఏమోగానీ, నేహా శెట్టి ప్రశ్నించడాన్ని మాత్రం అభినందించి తీరాలి. ఒక్క సినీ జర్నలిస్టు పైత్యమే కాదిది, చాలామంది అలాంటోళ్ళున్నారు.. కానీ, నేహా శెట్టి విషయంలో ఒక్కడే అడ్డంగా దొరికేశాడంతే.