ఇంటి ముందు వేప చెట్టు ఉండటం.. వాస్తు ప్రకారం శుభమా.. అశుభమా..?

ఇంటి చుట్టూ పచ్చదనం ఉంటే ఆరోగ్యం, ప్రశాంతత రెండూ లభిస్తాయనే నమ్మకం చాలా మందిలో ఉంటుంది. ముఖ్యంగా వేప చెట్టును పవిత్రమైనదిగా భావిస్తూ, ఇంటి సమీపంలో నాటేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం వేప చెట్టు ఎక్కడ ఉందన్నది అత్యంత కీలకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన దిశలో లేకపోతే, శుభానికి బదులు సమస్యలే ఎక్కువగా ఎదురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

వాస్తు నిపుణుల మాటల్లో చెప్పాలంటే, వేప చెట్టు ఇంటి ప్రధాన ద్వారానికి నేరుగా ఎదురుగా ఉండకూడదు. ఇలా ఉండటం వల్ల ఇంట్లోకి ప్రవేశించే శక్తి దెబ్బతిని, ప్రతికూల ప్రభావాలు పెరుగుతాయని వారు పేర్కొంటున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, అనవసర ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

అంతేకాదు, ఇంటి నైరుతి లేదా దక్షిణ దిశలో వేప చెట్టు ఉండటం అస్సలు శుభకరం కాదని వాస్తు శాస్త్రం స్పష్టం చేస్తోంది. ఈ దిశల్లో వేప చెట్టు ఉంటే, దాని నీడ ఎక్కువగా ఇంటిపై పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వేప చెట్టు నీడ నేరుగా ఇంటిపై పడితే ‘ఛాయ దోషం’ ఏర్పడుతుందని చెబుతున్నారు.

ఈ ఛాయ దోషం ప్రభావం వల్ల ఇంట్లో నివసించే వారు తరచూ అనారోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశముందని చెబుతున్నారు. దక్షిణ దిశలో ఉన్న వేప చెట్టు నీడ ఇంటిపై ఎక్కువగా పడటం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమవుతుందంటున్నారు.

అయితే వేప చెట్టు పూర్తిగా ఇంటి వద్ద ఉండకూడదన్నది కాదు. వాస్తు ప్రకారం ఇంటికి తూర్పు దిశలో, కొంత దూరంలో వేప చెట్టు ఉండటం మంచిదిగా భావిస్తారు. ఇలా ఉండటం వల్ల ఉదయపు సూర్యకాంతి అడ్డుపడకుండా, పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, వేప చెట్టు వేర్లు ఇంటి పునాదిని తాకకుండా చూసుకోవాలి. వేర్లు ఇంటి బేస్‌ను తాకితే భవిష్యత్తులో నిర్మాణ సమస్యలు, ఆర్థిక నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి వేప చెట్టును నాటేటప్పుడు దిశ, దూరం రెండింటినీ తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.