ఎన్టీయార్ స్థాయిని తగ్గించేస్తోన్న బాలయ్య.!

స్వర్గీయ నందమూరి తారక రామారావు మహానటుడు, మహా నాయకుడు. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. ఆయనకేదో భారతరత్న పురస్కారం రాలేదని.. ఆయన గౌరవం తగ్గిపోతుందని అనగలమా.? అయితే, ఆయనకు భారతరత్న ఎందుకు రావడంలేదు.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. భారతరత్న పురస్కారం వస్తేనే, స్వర్గీయ నందమూరి తారక రామారావుకి గౌరవమా.? అన్న చర్చే అసలు అర్థం లేనిది. భారతరత్న విషయమై స్వర్గీయ ఎన్టీయార్ తనయుడు బాలకృష్ణ ముందు పదే పదే మీడియా కొన్ని ప్రశ్నలుంచడం, ఈ ప్రశ్నలకు బదులిచ్చే సమయంలో బాలకృష్ణ, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారిపోయింది.

కాలిగోటితో సమానమంటూ భారతరత్న పురస్కారం గురించి బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ మళ్ళీ అవే వ్యాఖ్యలు చేస్తున్నారాయన. భారతరత్న అంటే అదొక పురస్కారం మాత్రమే కాదు.. భారతీయులందరికీ గర్వకారణమది. మన మహనీయుల్ని గౌరవించుకునేందుకు ఆ పురస్కారాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. అలాంటి పురస్కారానికి మనమే గౌరవం ఇవ్వకపోతే ఎలా.? నిజమే, భారతరత్న పురస్కారం విషయమై రాజకీయాలు నడుస్తున్నాయి. ఇందులో విపరీతార్థమేమీ లేదు. కానీ, ఆ రాజకీయ వ్యవస్థలో నందమూరి బాలకృష్ణ కూడా వున్నారు. ఓ పార్టీ నాయకుడాయన.. పైగా, ప్రజా ప్రతినిథి కూడా. స్వర్గీయ నందమూరి తారకరామారావుకి భారతరత్న పురస్కారమివ్వాలంటూ రాజకీయ పోరాటం చేసేందుకు బాలయ్యకు అవకాశం వుంది కూడా. జయంతికో వర్ధంతికో.. లేదంటే, మీడియా ప్రశ్నలడిగినప్పుడో భారత రత్న కోసం బాలయ్య సహా స్వర్గీయ ఎన్టీయార్ కుటుంబ సభ్యులు మాట్లాడటం అత్యంత హాస్యాస్పదం.