మార్నింగ్ షో టాక్ : ‘జాతిరత్నాలు’.. నవ్వించేశారట

Jathi Ratnalu
Jathi Ratnalu
 
ఈరోజు విడుదలైన సినిమాల్లో అన్నింటికంటే ఎక్కువ హైప్ కలిగిన చిత్రం ‘జాతిరత్నాలు’.  పేరుకు చిన్న సినిమానే అయినా భారీగా ప్రమోషన్లు చేశారు.  సెలబ్రిటీలను తీసుకొచ్చి హంగామా చేశారు.  టీజర్, ట్రైలర్, బుల్ బుల్ చిట్టి సాంగ్ ప్రేక్షకుల్ని సినిమా వైపు మళ్లేలా చేశాయి. ప్రీరిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది.  అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి.  చాలా చోట్ల సినిమా 90 శాతం ఆక్యుపెన్సీ సాధించింది.  ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు ఓపెనింగ్స్ పరంగా ఈ సినిమాదే పైచేయి.  మొదటి నుండి సినిమా టీమ్ ఇది చిల్లరగాళ్లు చేసే కామెడీ అంటూనే ఉన్నారు.  సినిమా చూసిన ఆడియన్స్ కూడ అదే అంటున్నారు.  చిల్లరోళ్ల కామెడీ బాగా నవ్వించింది అంటున్నారు.  
 
కథ పరంగా చెప్పుకోవడానికి గొప్పగా ఏమీ లేదు.  ముగ్గురు అత్తెసరు కుర్రాళ్లు అనుకోని నేరంలో ఇరుక్కుని జైలుకెళ్లి దాని ఎలా బయటపడ్డారు అనేదే కథ.  కథలో కొంత కథనం లాజిక్స్ కు అందకపోయినా ఫన్ మీద లాగించేశారు.  మొదటి అర్థ భాగం పూర్తిగా కామెడీ ట్రాక్స్ మీదే సినిమా నడిచింది.  దర్శకుడు అనుదీప్ సిద్ధం చేసుకున్న ప్రతి ట్రాక్ పేలింది.  అందుకు ప్రధాన కారణం నవీన్ పోలిశెట్టి నటన. ఏజెంట్ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్న నవీన్ ఈ సినిమాలో ఫూర్ కామెడీతో కడుపుబ్బా నవ్వించాడు.  పంచ్ డైలాగులు, ఫన్నీ సంభాషణలు, నవ్వించే హావభావాలతో ప్రతి సీన్ మొహం మీద నవ్వు తెప్పించేలా చేశాడు.  కోర్ట్ సన్నివేశాల్లో బ్రహ్మానందంకు, నవీన్ కు నడుమ నడిచే కామెడీ బాగా హైలెట్ అయింది.  చాలా రోజుల తర్వాత బ్రహ్మానందంగారి ఎస్సెన్స్ ఇందులో కనబడింది.  
 
రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కూడ తమ వంతు ప్రయత్నం చేశారు.  ద్వితీయార్థంలో నడిచే కథనంలోనే లాజిక్స్ మిస్సయ్యాయి.  ప్రధాన పాత్రలు చేసే ఇన్వెస్టిగేషన్ తాలూకు సీన్లు అక్కడక్కడా తెలిపోయాయి.  పాటల్లో బుల్ బుల్ చిట్టి సాంగ్ వినడానికే కాదు చూడటానికీ బాగుంది.  మొత్తం మీద ఈరోజు విడుదలైన మూడు సినిమాల్లో జాతిరత్నాలు ప్రేక్షకులకు మంచి ఫన్ అందించింది.  బలమైన కథా కథనాలను ఆశించకుండా కేవలం ఫన్ ఉంటే చాలనుకునే ఎంటర్టైన్మెంట్ ప్రియులకు ఈ చిత్రం మంచి వీకెండ్ వాచ్ అవుతుంది.