Liquor Deaths : సహజ మరణాలా.? నాటు సారా మరణాలా.? సీఎం జగన్ చెప్పింది రైటా.? రాంగా.?

Liquor Deaths : అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ఓ ప్రకటన చేస్తూ, పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో ‘నాటు సారా మరణాల’ అంశంపై స్పష్టతనిచ్చాక కూడా, అవి నాటు సారా మరణాలా.? సహజ మరణాలా.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తూనే వున్నాయి.

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాటు సారా, కల్తీ కల్లు ప్రభావం ఎక్కువగానే వుంది. సుమారు 24 మంది వరకు నాటు సారా కారణంగా జంగారెడ్డిగూడెంలో ఇటీవల ప్రాణాలు కోల్పోయినట్లు ప్రచారం జరుగుతోంది. బాధిత కుటుంబాలు అవి నాటు సారా మరణాలేనని చెబుతున్నాయి.

కానీ, మంత్రులు సైతం.. అవి సహజ మరణాలేనని చెబుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అయితే, జాతీయ స్థాయి సగటు లెక్కల్ని పేర్కొంటూ, నాటు సారా మరణాలకు ఆస్కారం లేదనీ, అవి కేవలం సహజ మరణాలేనని చెబుతున్నారు.

నిజానికి ఇది అత్యంత సున్నితమైన అంశం. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. పైగా, చట్ట సభలు నడుస్తున్న సమయంలో ఇలాంటి ఘటన జరగడం, దాన్ని విపక్షాలు.. ప్రదానంగా ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ హైలైట్ చేస్తున్న దరిమిలా.. మరింత లోతైన అధ్యయనం అధికారపక్షం చేయాల్సి వుంది.

‘సహజ మరణాలు’ అని మంత్రులు పేర్కొన్నా ముఖ్యమంత్రి చెప్పినా.. అది ‘దాటవేత ధోరణి’ లేదా, సమస్యను పక్కదారి పట్టించే వైఖరిగానే కనిపిస్తుంది. ‘గొడ్డలి పోటుని గుండెపోటుగా చిత్రీకరించారు.. అలాగే కల్తీ సారా మరణాల్ని సహజ మరణాలుగా చెబుతున్నారు..’ అంటూ ప్రతిపక్షం చేస్తున్న ప్రచారానికి బలం చేకూరుతోంది అధికార వైసీపీ వైఖరి కారణంగా.