ఏడాది చివ‌రి రోజు కూడా ఇండ‌స్ట్రీకు షాక్.. నర్సింగ్ యాద‌వ్ మృతితో విషాదంలో టాలీవుడ్

2020 సంవ‌త్సరం సినీ పరిశ్ర‌మ‌కు ఎంత‌టి విషాదాన్ని మిగిల్చిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. టాలీవుడ్‌, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ ఇండ‌స్ట్రీల‌కు సంబంధించి ఎందో ప్ర‌ముఖులు మృత్యువాత ప‌డ్డారు. కొంద‌రు అనారోగ్యంతో క‌న్నుమూయ‌గా, మరికొంద‌రు క‌రోనాతో క‌న్నుమూశారు. ఇండ‌స్ట్రీకి ఈ ఏడాది చీక‌టి సంవ‌త్స‌రంగా మిగ‌ల‌నుంది. ఈ రోజు ఏడాది చివ‌రి రోజు కావ‌డంతో అంద‌రు కొత్త సంవ‌త్స‌రానికి వెల్‌క‌మ్ చెప్పేందుకు సిద్ద‌మ‌వుతున్న త‌రుణంలో మరో విషాద వార్త వినిపించింది.

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో క‌లిపి దాదాపు 300కు పైగా చిత్రాల‌లో న‌టించిన న‌ర్సింగ్ యాద‌వ్‌(52) కొద్ది సేప‌టి క్రితం క‌న్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న సోమాజిగూడ‌లోని య‌శోద ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ తిరిగి రాని లోకాల‌కు వెళ్లారు. ఆయ‌న మృతితో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ దిగ్భ్ర్రాంతికి గురైంది. మంచి న‌టుడిని కోల్పోయామంటూ ప‌లువురు ప్ర‌ముఖులు ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్దిస్తున్నారు.

1968 జనవరి 26న హైదరాబాద్‌లో జ‌న్మించిన నర్సింగ్ యాద‌వ్.. హేమాహేమీలు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. నర్సింగ్ యాదవ్ స్వస్థలం హైదరాబాద్. క్షణక్షణం, ముఠామేస్త్రి, శంకర్ దాదా ఎమ్.‌బి.బి.ఎస్, గాయం, కిల్లర్, మాస్, మాయలోడు, ఫ్యామిలీ సర్కస్, టెంపర్, రేసుగుర్రం, పిల్ల జమిందార్, అన్నవరం, సైనికుడు వంటివి ఆయ‌న‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. నర్సింగ్ యాదవ్‌కు భార్య చిత్ర యాదవ్, తనయుడు రుత్విక్ యాదవ్ ఉన్నారు. నర్సింగ్‌ యాదవ్‌కు దర్శకుడు రాంగోపాల్‌ వర్మ బ్రేక్ ఇవ్వ‌గా, ఆయ‌న తీసిన ప్రతీ మూవీలో నర్సింగ్‌ యాదవ్‌కు తప్పనిసరిగా ఓ క్యారెక్టర్‌ ఉండాలే ప్లాన్ చేశాడు వ‌ర్మ. మ‌రో మంచి న‌టుడిని తెలుగు సినీ ప‌రిశ్ర‌మ కోల్పోవ‌డం బాధాకరం.