వాడకంలో చంద్రబాబు నాయుడును మించిన నాయకుడు లేడని అంటుంటారు చాలామంది. నిజమే రాజకీయ ఎత్తుగడలు వేయడంలో బాబుది అందెవేసిన చేయి. ముఖ్యానంగా వాడకం, వదిలేయడం అనే కాన్సెప్ట్ పేటెంట్ హక్కులు ఆయనే ఉంటాయి. ఎవరైనా అవసరం అనుకుంటే వెంటనే తీసుకొచ్చి కుర్చీవేసి పక్కనే కూర్చోబెట్టుకుని అవసరం తీరగానే ఆ కుర్చీని లాగేసే నైజం ఆయనది. బయటివారైనా, సొంత వ్యక్తులైనా ఈ ఫార్ములాలో మార్పు ఉండదు. అలా చంద్రబాబు వాడుకుని పక్కనపెట్టిన వారిలో జూ. ఎన్టీఆర్ ఒకరు. ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్‌ను బాగా ఉపయోగించుకున్న ఆయన ఆతర్వాత కన్నెత్తి కూడ చూడలేదు.
ఈ కారణం మూలంగానే ఇప్పటికీ తారక్ టీడీపీ వైపుకు కన్నెత్తి చూడటంలేదు. పార్టీలోని నందమూరి అభిమానులు చిన్న రాముడు రావాలి, పార్టీ పగ్గాలు అందుకోవాలి అంటున్నా ససేమిరా అంటున్నారు. ఇలా తన నైజంతో నందమూరి ఫ్యామిలీ నుండి ఒక హీరోను రాజకీయాలంటేనే విరక్తుడిని చేసిన బాబుగారు ఇప్పుడు మరొక హీరోను పట్టుకున్నారని టాక్. అయితే ఈసారి నందమూరి కుటుంబం నుండి కాదు నారావారి కుటుంబం నుండే. అతనే నారా రోహిత్. రోహిత్ చంద్రబాబు సోదరుడి కుమారుడు. చాలా ఏళ్ల క్రితమే సినిమాల్లోకి వచ్చి మంచి పేరు తెచ్చుకున్న రోహిత్ ఈమధ్య సినిమాలు చెయ్యట్లేదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని రిజెక్ట్ చేస్తున్నారు. ఇందుకు కారణం ఆయన రాజకీయ రంగప్రవేశమేనని అంటున్నారు చాలామంది.
చంద్రబాబుగారి పిలుపు మేరకు రోహిత్ పచ్చ జెండాను భుజానికెత్తుకోవడానికి రెడీ అవుతున్నారట. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన పార్టీ కోసం ఆంధ్రాలో ప్రచారం నిర్వహించారు. తాజాగా కూడ తెలంగాణ టీడీపీ ఆధ్వర్యంలో జరగబోయే ఒక సేవా కార్యక్రమానికి ప్రచారం నిర్వహించారు. దీంతో రోహిత్ నారాకు తెలంగాణ టీడీపీలో కీలక బాధ్యతలు అప్పగించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే రోహిత్ తండ్రిని రాజకీయంగా ఎదగకుండా చేసింది చంద్రబాబే అంటుంటారు చాలామంది. మరి అదే నిజమైతే ఇప్పుడు నారా రోహిత్ ను సైతం అవసరం మేరకు వాడుకుంటారు తప్ప అవసరానికి మించి ఎదగనిస్తారా అనేది పెద్ద సందేహంగా మారింది.