నారా లోకేష్ జైలుకెళ్ళబోతున్నారా.? నిజమేనా.?

ఇటు సోషల్ మీడియాలో చెలరేగిపోవడమే కాదు, జనంలోకి వెళ్ళినప్పుడూ నానా రకాలుగా అధికార పార్టీని తూలనాడుతున్నారు మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్. రాజకీయాల్లో రాజకీయ విమర్శలు మామూలుగానే, వ్యక్తిగత విమర్శల స్థాయికి దిగజారిపోతున్నారు చంద్రబాబు తనయుడు. ఈ క్రమంలో నారా లోకేష్ మీద కేసులు బనాయించడం అనేది అధికార పార్టీకి పెద్ద విషయమేమీ కాదు. పైగా, చాలామంది వైసీపీ నేతలు కాచుక్కూర్చున్నారు నారా లోకేష్ మీద ఫిర్యాదులు చేసెయ్యడానికి. వైసీపీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ అందితే కేసులు నమోదవడమెంతపని.? ఆ తర్వాత నారా లోకేష్ జైలుకి వెళ్ళడం ఎంత పని.? కానీ, ఎక్కడో అధికార పార్టీ సంయమనం పాటిస్తోందా.? లేదంటే, కావాలనే అధికార పార్టీ రెచ్చగొడ్తోందా.? అన్న డౌటానుమానాలైతే చాలామందిలో వున్నాయి.

లోకేష్ జైలుకి వెళితే, విపరీతమైన పాపులారిటీ దక్కతుంది. ఈ రోజుల్లో ‘జైలుకెళ్ళడం’ అనేది రాజకీయ నాయకులకు ఓ పొలిటికల్ బోనస్ అయిపోయింది తప్ప, అదేమీ తప్పుగా ఎవరూ భావించడంలేదు. ఎన్ని ఎక్కువ కేసులుంటే, అంత పెద్ద నాయకుడిగా పరిగణింపబడుతున్న రోజులివి. ‘నారా లోకేష్ మీద అధికార పార్టీ కన్ను పడింది.. ఆయన్ని అరెస్టు చేసి, జైలుకు పంపేందుకు కుట్ర జరుగుతోంది..’ అంటూ ఇటీవలే ఓ కేసులో అరెస్టయి, జైలుకి వెళ్ళి వచ్చిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. నిజానికి, చంద్రబాబుని సైతం అరెస్ట్ చేయించేందుకు అమరావతి కుంభకోణాన్ని తెరపైకి తెచ్చింది వైఎస్ జగన్ సర్కార్. కానీ, ఇక్కడ వైసీపీ సర్కారు పప్పులుడకలేదు, చంద్రబాబు తన స్టయిల్లో ముందుగానే జాగ్రత్తపడ్డారు. ఏమో, రానున్న రెండేళ్ళలో ఏమైనా జరగొచ్చు. రాజకీయ నాయకులు జైలుకెళ్ళడమనేది పెద్ద విషయం కాదు. కానీ, తద్వారా వారికి అదనపు పబ్లిసిటీ లభిస్తుండడమే శోచనీయం.