టీడీపీకీ, చంద్రబాబుకీ నారా లోకేష్‌తో పెద్ద తలనొప్పి.!

నారా లోకేష్ తన పుత్రరత్నం గనుక, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు.. ఆయన్ని రాజకీయంగా ప్రోత్సహించడం తప్పనిసరి. పార్టీ ప్రయోజనాల్ని పణంగా పెట్టి మరీ నారా లోకేష్‌ని ముందుకు తీసుకొస్తూనే వున్నారు చంద్రబాబు.

టీడీపీని వీడుతోన్న మెజార్టీ నాయకులు చెబుతున్నది నారా లోకేష్ వల్లనే పార్టీ భ్రష్ట్టు పట్టిపోతోందని. మామూలుగా అయితే ఎవరైనా ఇలాంటి సందర్భాల్లో పుత్రరత్నాన్ని కాస్త వెనక్కి లాగుతారు. తెరవెనుకాల వ్యవహారాలు చక్కెబెట్టేలా మాత్రమే బాధ్యతలు అప్పగిస్తారు.

చంద్రబాబు రూటే సెపరేటు. పార్టీ నుంచి అందరూ బయటకు వెళ్ళిపోయినా నారా లోకేష్ ఒక్కడితో కలిసి తాను పార్టీని నడిపించేస్తాననే భ్రమల్లో వున్నారు చంద్రబాబు. తిరుపతి ఉప ఎన్నిక విషయంలో కావొచ్చు, ఇతరత్రా కీలక సందర్భాల్లో కావొచ్చు.. నారా లోకేష్ ‘అతి’, టీడీపీని చావుదెబ్బ తీసిందన్నది నిర్వివాదాంశం.

పార్టీకి నాయకులు అవసరం. సమర్థులైన నాయకుల విషయంలో నారా లోకేష్ వ్యవహరించే తీరు పార్టీకి నష్టం చేస్తోంది. లోకేష్‌తో వేగలేక, చంద్రబాబుకి సర్ది చెప్పలేక.. టీడీపీని వీడుతున్నారు ఆ పార్టీకి ఎన్నో ఏళ్ళుగా సేవలందించిన సీనియర్ నాయకులు.

ఇప్పుడిలా టీడీపీ భ్రష్టుపట్టిపోవడానికి చంద్రబాబు, నారా లోకేష్ విషయంలో వ్యవహరిస్తున్న తీరే కారణమన్న విమర్శలు అంతగట్టిగా వినిపిస్తున్నా చంద్రబాబు సైతం ఏమీ చేయలేని పరిస్థితి. స్థానిక ఎన్నికల వేళ కూడా నారా లోకేష్ పెత్తనం పార్టీకి శాపంగా మారిందన్న చర్చ పార్టీ వర్గాల్లోనే జరుగుతోంది.
ఇప్పుడు కుప్పం మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో కూడా నారా లోకేష్ ఓవరాక్షన్, టీడీపీ విజయావకాశాల్ని దెబ్బతీస్తోంది.