ఈమధ్య రాజకీయ నాయకుల జీవితాలను సినిమాలుగా తెరకెక్కించడం ఒక ట్రెండ్ అయింది. తెలుగులో కూడ ఈ ట్రెండ్ నడుస్తోంది. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి నేతల జీవితాల ఆధారంగా సినిమాలు రూపొందాయి. ఇప్పుడు మరొక నేత వైఎస్ జగన్ జీవితం మీద సినిమా రాబోతోందట. ఈ సినిమాలో సీనియర్ హీరో అక్కినేని నాగార్జున నటిస్తారని, అది కూడ వైఎస్ జగన్ పాత్రలోనేనని ఫిల్మ్ నగర్ టాక్. గతంలో వైఎస్ఆర్ మీద తెరకెక్కిన ‘యాత్ర’ చిత్రం మంచి ప్రజాదరణ పొందింది. మహి వి రాఘవ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అందులో వైఎస్ పాత్రలో మమ్ముటి కనిపించారు. ఆ సినిమా చూసిన అందరూ వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి నటన అద్భుతమని అన్నారు.
రాజశేఖర్ రెడ్డి రాజకీయ ప్రయాణం ఎలా సాగింది, ఆయన పాదయాత్ర ఎలా చేశారు, సీఎం పీఠం ఎలా అందుకున్నారు లాంటి విషయాలను ‘యాత్ర’ చిత్రంలో ప్రస్తావించారు. ఇప్పుడు వైఎస్ తనయుడు వైఎస్ జగన్ జీవితంతో సినిమా రూపొందనుంది. ఇది ‘యాత్ర’ సినిమాకు కొనసాగింపు అని అంటున్నారు. దీనికి కూడ డైరెక్టర్ మహి వి రాఘవేనట. ఈ చిత్రం వైఎస్ఆర్ మరణం, ఆ తర్వాత ఆంధ్రా రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలు, జగన్ సొంత పార్టీ పెట్టుకోవడం, ఆయన జైలుకి వెళ్లడం, బయటికి రావడం, ప్రతిపక్ష నేతగా ఎదగడం, ఆ తర్వాత ఆయన చేసిన ప్రజాసంకల్పయాత్ర, ముఖ్యమంత్రి అయిన విషయాలను ఇందులో ప్రస్తావిస్తారట.
జగన్ పాత్రకు నాగార్జున అయితేనే సరిగ్గా సరిపోతారని డైరెక్టర్ భావిస్తున్నారట. ఇప్పటికే సినిమా ప్రపోజల్ నాగార్జున వరకు వెళ్లిందని కూడ అంటున్నారు. నాగార్జున, జగన్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఒకరంటే ఒకరికి మంచి గౌరవం. కనుక నాగర్జున కూడ సినిమాకు ఒప్పుకునే అవకాశాలే ఎక్కువని అంటున్నారు. జగన్ పొలిటికల్ జర్నీలో ఎన్నో ఎత్తుపల్లాలు, సాహసోపేత నిర్ణయాలు, తెగింపు, ధైర్యం, ధిక్కారం, ఓటమి, గెలుపు లాంటి అంశాలన్నీ ఉంటాయి. ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు చేసిన ప్రయాణం ఆద్యంతం ఆసక్తిదాయకం. కమర్షియల్ సినిమాకు కావాల్సినని ఇవే. కాబట్టి సినిమా అంటూ రూపొందితే అది అద్దిరిపోయేలానే ఉంటుంది.