బాబూ ఓ నాగబాబూ.! బఫూన్ ఎవరు.?

Nagababu

ఔను, మంత్రి అంబటి రాంబాబు అర్థం పర్థం లేని ప్రశ్నే వేసి వుండొచ్చు.. జనసేన పార్టీ మొత్తంగా 175 సీట్లలో పోటీ చేస్తుందా.? లేదా.? అని. రాజకీయాల్లో అంతే. ప్రశ్నలొస్తాయ్.. సమాధానాలు చెప్పగలిగితే చెప్పాలి, లేదంటే.. చెప్పడం చేతకాదని ఊరుకోవాలి. అంతేగానీ, ‘బఫూన్’ వేషం వేస్తే ఎలా.?

సినీ నటుడు, జనసేన నేత నాగబాబు ఓ బఫూన్ ఫొటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది మంత్రి అంబటి రాంబాబుకి గ్రాఫిక్స్ ద్వారా వేసిన బఫూన్ వేషం. ‘ఎన్నిసార్లు ఒకే ప్రశ్న అడుగుతావయ్యా! బాబూ… ఓ రాంబాబు… జంబో సర్కస్ బఫూన్లు అడిగే క్లారిఫికేషన్స్ కి, వైసిపి సర్కస్ లో నీలాంటి బఫూన్ గాళ్ళు అడిగే క్లారిఫికేషన్స్ కి సమాధానం చెప్పే ఓపిక, తీరిక మా జనసైనికులకి లేదు. మా ప్రెసిడెంట్ గారికి అంతకంటే లేదు.’ అంటూ ట్వీటేశారు నాగబాబు సోషల్ మీడియాలో.

ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రి కూడా అయిన అంబటి రాంబాబు బఫూన్ అయితే, లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయిన నాగబాబుని ఏమనాలి.? పార్టీ అధినేతగా రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కళ్యాణ్‌ని ఏమనాలి.? అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది.

సరే, రాజకీయాల్లో గెలుపోటములు అనేవి సర్వసాధారణమనుకోండి.. అది వేరే సంగతి. కానీ, ఇట్నుంచి కనిపించే చేతల్ని బట్టి, అట్నుంచి వచ్చే విమర్శలు కూడా ఆధారపడి వుంటాయి.

జనసేన ఎన్ని చోట్ల పోటీ చేస్తే మాత్రం, దాంతో మంత్రి అంబటి రాంబాబుకి ఏం పని.? అన్నది నిజమే. అయినాగానీ, ఆయన ప్రశ్నించేశారు. దానికి జనసేన ఓ సమాధానమిచ్చేస్తే సరిపోయేదానికి, బఫూర్ క్యారెక్టర్‌లోకి అంబటి రాంబాబుని జొప్పించడం ఎంతవరకు సమంజసం.?

వైసీపీకీ చాలా పెద్ద సోషల్ మీడియా నెట్‌వర్క్ వుంది. అట్నుంచి అంతకు మించిన కౌంటర్ ఎటాక్స్ పడతాయ్. మళ్ళీ దానికి జనసేన నుంచి రిటార్టులూ వుంటాయ్. ఇంతేనా.? ఈ రాజకీయం ఇంతేనా.? ఉన్నతమైన భావాల్ని సోషల్ మీడియాలో పంచుకునే నాగబాబు, ఇలా తరచూ సిల్లీ ట్వీట్లేసి తన స్థాయిని తగ్గించేసుకుంటుంటారు. అదేంటో, రాజకీయాల్లోకి వచ్చిందే తమ స్థాయిని తగ్గించుకోవడానికి అన్నట్లు వ్యవహరిస్తుంటారేంటో.!