మెగాబ్రదర్ నాగబాబు, జనసేన పార్టీ పేరుని మర్చిపోవడమా.? 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నుంచి పోటీ చేసిన నాగబాబు, పార్టీ పేరుని మర్చిపోవడం ఆశ్చర్యమే. అయితే, సోషల్ మీడియాలో షికార్లు చేస్తోన్న ఓ వీడియో చూస్తే, ఆ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఓ న్యూస్ ఛానల్ చర్చా కార్యక్రమంలో ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల విషయమై మాట్లాడుతున్న సమయంలో నాగబాబు, జనసేన పార్టీ పేరుని మర్చిపోయారు. జన.. జన.. అదేంటబ్బా.. అంటూ నాగబాబు సొంత పార్టీని మర్చిపోవడంపై సోషల్ మీడియాలో పెద్దయెత్తున విమర్శలు జనసైనికుల నుంచే వస్తున్నాయి.
జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో ఇందుకే ఓడిపోయిందన్న ఆవేదన జనసైనికుల్లో వ్యక్తమవుతోంది. నిజానికి, 2019 ఎన్నికలకు చాలా తక్కువ సమయం మందు మాత్రమే నాగబాబు, జనసేనలో చేరారు. ఎన్నికల్లో ప్రచారం పరంగా నాగబాబు చెమటోడ్చినా ఫలితం లేకుండా పోయింది. జబర్దస్త్ బ్యాచ్ కూడా నాగబాబు తరఫున నర్సాపురం నియోజకవర్గంలో ప్రచారం చేసింది. అయినా, నాగబాబు ఓటమి తప్పలేదు. కొద్ది నెలల ముందు నాగబాబు, జనసేన పార్టీలో చేరి.. పార్టీ కోసం పనిచేసి వుంటే, ఖచ్చితంగా రిజల్ట్ మెరుగ్గా వుండేదన్నది అప్పట్లో జనసైనికులు వ్యక్తం చేసిన అభిప్రాయం.
కొన్నాళ్ళ క్రితం వరకూ జనసేన తరఫున సోషల్ మీడియాలో బాగానే వకాల్తా పుచ్చుకున్న నాగబాబు, ఈ మధ్యకాలంలో ఎందుకో పార్టీ గురించి ఎలాంటి వ్యాఖ్యలూ చేయడంలేదు. దాంతో, నాగబాబు పూర్తిగా జనసేనకు దూరమైపోయినట్లేనని జనసైనికులూ భావించారు. ఇంతలోనే ఇంత పెద్ద బాంబు నాగబాబు, జనసేన నెత్తిన వేసేశారు.. పార్టీ పేరుని మర్చిపోవడం ద్వారా.