అసలే దశ దిశా లేని ప్రయాణం, ఆపై గమ్యం ఎక్కడో తెలియని సేనాని.. వెరసి జనసేన పార్టని పాతాళానికి తొక్కేస్తున్నాయి. 2019 ఎన్నికల్లో ఓడిపోయాక పవన్ ఒంటరి పోరాటానికి సిద్ధపడ్డారు. అప్పట్లో ఆయన ఊపు చూసి ఏదో వెలగబెట్టేస్తారని అంతా అనుకున్నారు. కానీ రియాలిటీలో అంత సీన్ కనబడట్లేదు. తిరిగి తిరిగి మళ్ళీ బీజేపీ చెంతకే చేరారు. సరే పొత్తులతో అయినా ప్రయోజనం పొందుతున్నారా అంటే అదీ లేదు. డబ్బు సంపాదన కోసమని, అదే తన బ్రతుకుదెరువని కబుర్లు చెప్పి సినిమాలు చేసుకుంటున్నారు పవన్. ఆయన పార్టీకి ఏం పనులు చేస్తున్నారో కార్యకర్తలకు కూడ తెలియడంలేదు.
ఎన్నికలు ముగిశాక ప్రధాన పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలకు జనసేన మంచి ఛాయిస్ అవుతుందని, తద్వారా పార్టీ బలపడుతుందని కార్యకర్తలు అంచనాలు వేసుకున్నారు. కానీ ఒక్కరు కూడ జనసేన వైపు కన్నెత్తిచూడట్లేదు. ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడ టాటా చెప్పేశారు. ఇక పార్టీలో నెంబర్ టూగా పేరుపడిన నాదెండ్ల మనోహర్ సైతం ఇప్పుడు పార్టీ మీద విముఖతతో ఉన్నారని టాక్ వినబడుతోంది. మొదటి నుండి జనసేనకు అన్నీ తానే అన్న తరహాలో వ్యవహరించే పవన్ నాదెండ్లకు మాత్రం కొంత వెసులుబాటు ఇచ్చారు. ఎక్కడికి వెళ్లినా పక్కనే ఉంచుకుంటూ నెంబర్ టూను చేశారు.
నాదెండ్ల సైతం రాజకీయ వ్యవహారాల చైర్మన్ పదవిలో కొంతకాలం చురుగ్గానే ఉన్నారు. పవన్ కొన్నిటి మీద స్పందిస్తే నాదెండ్ల ఇంకొన్నిటి మీద స్పందించేవారు. కానీ ఉన్నట్టుండి ఆయన సైలెంట్ అయిపోయారు. ఈమధ్య ఎక్కడా ఆయన మాట వినబడట్లేదు. పవన్ సినిమాల్లోకి వెళ్లారు కాబట్టి ఇప్పుడే నాదెండ్ల వాయిస్ పెరగాలి. కానీ అందుకు విరుద్దంగా జరుగుతోంది. పవన్ తో పాటే ఆయన కూడ మౌనం పాటిస్తున్నారు. ఎక్కడా పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్న దాఖలాలు లేవు. కొందరేమో పవన్ సినిమాల బాట పట్టడం నాదెండ్లకు నచ్చలేదని, పార్టీ భవిష్యత్తు మీద నమ్మకం కోల్పోయారని, త్వరలో వేరే దారి చూసుకుంటారని చెబుతున్నారు. అదే నిజమైతే జనసేనకు నష్టం తప్పదు.