హమ్మయ్య.. ఆంధ్రప్రదేశ్‌లో ఆ వైరస్ లేదని తేల్చేశారు

N440K Strain In Andhra Pradesh, Here Is The Truth

N440K Strain In Andhra Pradesh, Here Is The Truth

కరోనా వైరస్, ఆంధ్రపదేశ్లో అత్యంత వేగంగా విస్తరిస్తోంది. రోజువారీ కేసులు 20 వేల పైన నమోదవుతున్నాయి గత కొద్ది రోజులుగా. దీనికి తోడు.. కొత్తగా రాష్ట్రంలో ఎన్ 440కే అనే మ్యుటెంట్ బాగా విస్తరిస్తోందనీ, ఇది సాధారణ కరోనా వైరస్ కంటే 15 రెట్లు వేగంగా ఇతరులకు వ్యాపిస్తుందనీ ప్రచారం జరుగుతోంది. దాంతో, ప్రజల్లోనూ భయాందోళనలు పెరిగిపోయాయి. అయితే, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ కొత్త మ్యుటెంట్ విషయమై స్పష్టతనిచ్చింది. ఎన్ 440కే వైరస్ అనేది తీవ్రంగా వున్నట్లు ఎలాంటి నిర్ధారణ జరగలేదని ఏపీ స్టేట్ కమాండ్ కంట్రోల్ ఛైర్మన్ కేఎస్ జవహర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రతినెలా సీసీఎంబీకి 250 నమూనాలు వెళుతుంటాయనీ, ఎన్ 440కె (బి 1.36) వైరస్ దక్షిణ భారతదేశం నుంచి వెళ్ళిన నమూనాల్లో గుర్తించడం జరిగిందనీ, అయితే ఈ వైరస్ ప్రభావం గత డిసెంబర్, ఈ ఏడాది జనవరి అలాగే ఫిబ్రవరి నెలల్లో కనిపించిందనీ, మార్చి తర్వాత అది పూర్తిగా అంతర్థానమైందని అన్నారు.

ప్రస్తుతానికైతే బి 1.167, బి 1 వైరస్ స్ట్రెయిన్ల ప్రభావం దక్షిణ భారతదేశంపై ఎక్కువగా వుందని నిపుణులు చెబుతున్నారు. ఇదే ఎక్కువమందికి కరోనా వైరస్ సోకడానికి కారణంగా చెబుతున్నారు. యువతలోనూ ఈ వైరస్ ప్రభావమే ఎక్కువగా వుంటోంది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే, ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో కరోనా కట్టడికి మెరుగైన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడించింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న భరోసాకీ, కేసుల పెరుగుదలకీ అస్సలేమాత్రం పొంతన లేకుండా పోతోంది. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి చాలా అధికంగానే వుంది. అయితే, అది అత్యంత ప్రమాదకరమైన కొత్త మ్యుటెంట్.. అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చిన దరిమిలా, అది ప్రజలకు కొంత ఊరటగానే భావించాలి.