ఒకప్పుడు విజయనగరం అంటే టీడీపీకి పెట్టని కోట అనే పేరు ఉండేది, కానీ 2019 లో వైసీపీ దెబ్బకి కోటలు బీటలు వారింది. 9 స్థానాల్లో వైసీపీ విజయకేతనం ఎగరవేసి టీడీపీకి భారీ షాక్ ఇచ్చింది. దీనితో విజయనగరంలో తిరిగి పార్టీకి పూర్వ వైభవం తీసుకోవటం అత్యంత కష్టమైన పని అని అర్ధం అయ్యింది. ఎలాగోలా కాయకల్ప చికిత్స చేసి పార్టీని రేసులో నిలబెట్టాలని చూస్తున్న ఆ జిల్లా సీనియర్ నేతల ఆలోచనలకు చంద్రబాబు చెక్ పెట్టాడు.
తాజాగా విజయనగరం టీడీపీ అధ్యక్షడు గా చీపురుపల్లి ఇంచార్జి కిమిడి నాగార్జున ని నియమించటంతో ఒక్కసారిగా విజయనగరం టీడీపీ నేతలు షాక్ తిన్నారు. అధ్యక్ష స్థానం కోసం పోటీపడిన మీసాల గీత, కారణం శివరామ కృష్ణ,ఐవీపీ రాజు , కంది చంద్ర శేఖర్ లాంటి వాళ్ళు డీలా పడిపోయారు. కార్యకర్తలకు సరిగ్గా అందుబాటులో ఉండడు అనే పేరున్న కిమిడి నాగార్జునను తీసుకొచ్చి విజయనగరం పార్లమెంట్ అధక్ష్య పదవిలో కూర్చోబెట్టటం ఈ సీనియర్ నేతలకు సుతారం ఇష్టం లేదు. ఈ క్రమంలో చీపురుపల్లి సీనియర్ నేత, రెండు సార్లు గెలిచిన గద్దె బాబురావు పార్టీకి కన్నీటితో రాజీనామా చేసి వెళ్ళిపోవటం జరిగింది. మిగిలిన టీడీపీ సీనియర్ నేతలకు కూడా తమ రాజకీయ భవిష్యత్తుపై బెంగ పట్టుకుంది. అధికారంలో లేకపోయినా ఏదో అధక్ష్య పదవి ఉంటే ఎలాగోలా నెట్టుకొని రావచ్చు అనుకున్నారు, కానీ ఆ అవకాశం కూడా లేకపోవటంతో వాళ్ళు పక్క చూపులు చూస్తున్నట్లు సమాచారం.
విజయనగరం అంటే గుర్తొచ్చే అశోక్ గజపతి రాజు వర్గం కూడా ఈ విషయంపై ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అశోక్ గజపతి రాజు ప్రభ విజయనగరంలో మసకబారుతుంది. మాన్సాస్ ట్రస్ట్ విషయంలో అశోక్ గజపతిరాజుకి ఎదురుదెబ్బ తగలటంతో చాలా వరకు మౌనం వహిస్తున్న ఆయన వర్గం, ఇప్పుడు నియోజకవర్గ అధ్యక్ష పదవి కూడా తమకి తగ్గకపోవడంతో చాలా నిరాశలో కూరుకుపోయింది. ఇలాంటి సమయంలో సీనియర్స్ అందరిని కలుపుకొని విజయనగరంలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకోని రావటం కిమిడి నాగార్జునకి కత్తి మీద సామే అని చెప్పుకోవాలి. అసంతృప్తితో వున్నా సీనియర్స్ నేతలను బుజ్జగించటం అంత సులువైన పని కానీ, మద్దతు ఇవ్వకపోగా కనీసం పార్టీలో వాళ్ళని ఉంచటం కష్టం. టీడీపీ పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇవ్వటం మంచి పరిణామమే, అయితే అది మెజారిటీ సభ్యుల ఆమోదంతో జరిగితే బాగుంటుంది కానీ ఇలా అందరిని అసంతృప్తికి గురిచేస్తూ యువతకు ప్రాధాన్యత ఇవ్వటం వలన పార్టీకి నష్టం కలిగే అవకాశం లేకపోలేదు