Crime News: ఒక మొబైల్ ఫోన్ మిత్రుల మధ్య చిచ్చుపెట్టింది. ఒకరి చిన్న తప్పిదం వల్ల ఒక కుటుంబానికి శోకం మిగిలింది. క్షణికావేశంలో మిత్రుడి ప్రాణం తీశారు తోటి మిత్రులు. ఈ సంఘటన తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూరులో చోటు చేసుకుంది. తాండూరు పట్టణంలో జశ్వంత్, ప్రశాంత్, రాజు అనే ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. జశ్వంత్ ది అంతారం, ప్రశాంత్ ది తాండూరు, రాజు మల్ రెడ్డి పల్లి కి చెందిన వాడు. ఒకరోజు ప్రశాంత్ ఒక సెల్ ఫోన్ తీసుకొని వచ్చి, తన ఇద్దరు మిత్రులకు ఇచ్చి తనకు అర్జెంట్ గా డబ్బు అవసరం ఉందని, సెల్ ఫోన్ ను అమ్మి పెట్టమని వారిని కోరాడు. మిత్రుడు అడగగానే రాజు, జశ్వంత్ సెల్ ఫోన్ తీసుకొని ఒక మొబైల్ షాప్ వద్దకు వెళ్లారు. సెల్ ఫోన్ ను మొబైల్ షాప్ అతనికి ఇచ్చి దీనిని ఎంత రేటుకి అమ్మవచ్చు అని అడిగారు. దానిని గమనించిన సెల్ ఫోన్ షాప్ వ్యక్తి దొంగతనం చేసిన ఫోన్ ను తీసుకువచ్చి నాకు అమ్మాలని చూస్తున్నారా అని వాళ్ల మీద తిరగబడ్డాడు. రాజు, జశ్వంత్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమ స్నేహితుడు దొంగిలించిన ఫోన్ అమ్మి పెట్టాలని అడిగాడు అని గ్రహించారు.
దొంగతనం చేసిన ఫోన్ ఇచ్చి బయట తమ పరువు తీశాడు అని రాజు, జశ్వంత్ లు ప్రశాంత్ మీద పగ పెంచుకున్నారు. ఎలాగైనా ప్రశాంత్ కు బుద్ధి చెప్పాలని భావించారు. ప్రశాంత్ ను చంపడానికి పథకం రచించిన రాజు, జశ్వంత్ లు ప్రశాంత్ కి ఫోన్ చేసి ఊరి శివారుకి పిలిచారు. అతన్ని పెద్దేముల్ మండలం గొట్లపల్లి శివారులో ఎవరు లేని ఈ ప్రాంతానికి తీసుకువెళ్లారు. అతనిని తీవ్రంగా కొట్టి పక్కనే ఉన్న బండరాయితో తలమీద కొట్టి హత్య చేశారు. దొంగిలించిన సెల్ ఫోన్ తమకు ఇచ్చి తమను కూడా దొంగలుగా చిత్రీకరించాడని కోపంతో రాజు, జశ్వంత్ లు ప్రశాంత్ ను హత్య చేశారు.
హత్యానంతరం రాజు, జశ్వంత్ ఇద్దరూ కలిసి తాండూరు పోలీస్ స్టేషన్ లో లొంగి పోయారు. తాము తమ స్నేహితుడిని హత్య చేసినట్టు పోలీసులకు చెప్పారు. తమ స్నేహితుని ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందో పోలీసులకు వివరించారు నిందితులు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇద్దరు నిందితులను పెద్దేముల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రశాంత్ చేసిన చిన్న తప్పిదం ప్రాణాల మీదకు తీసుకు వచ్చింది. రాజు, ప్రశాంత్ లు క్షణికావేశంలో ప్రాణాలు తీయడంతో ప్రశాంత్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.