ఈఎస్ ఐ స్కామ్ లో అభియోగం పై అరెస్ట్ అయిన మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు వ్యవహారం అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. ఈనెల 25 నుంచి 27 వరకూ ఏసీబీ కస్టడీకి ఇస్తూ విజయవాడ కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం చికిత్స నేపథ్యంలో అచ్చెన్న గుంటూరు ఆసుపత్రిలో ఉన్నారు. ఆస్పత్రి వైద్యుల నుంచి వివరాలు తెప్పించుకున్న జడ్జి ఈ మేరకు న్యాయవాది సమక్షంలో ఏసీబీ అధికారులు విచారించాలని స్పష్టం చేశారు. విచారణతో ఎక్కువగా ఇబ్బంది పెట్టొద్దని, ఆసుపత్రిలోనే ప్రశ్నించాలని కస్టడీకి ఇచ్చారు. కానీ బుధవారం అర్ధరాత్రి పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి.
గురువారమే అచ్చెన్నను డిశ్చార్జ్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తమకు తెలిసిందని అచ్చెన్న తరుపు న్యాయవాదులు వెల్లడించారు. దీంతో అచ్చెన్న వ్యవహారం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు అచ్చెన్న వ్యవహారంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అచ్చెన్నాయుడుని హతమార్చడానికి కుట్ర చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ, ఆలపాటి రాజా సంచలన ఆరోపణలు చేసారు. అచ్చెన్నను చంపడానికి దుర్మర్గమైన పథకం వేసారంటూ మండిపడ్డారు. సజ్జల రామకృష్ణా రెడ్డి డైరెక్షన్ లో ఇదంతా జరుగుతుందన్నారు.
అర్ధరాత్రి హైడ్రామా అంతా ఆయన డైరెక్షన్ లో జరిగిందని ఆరోపించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయ పార్టీల్లో చర్చనీ యాంశంగా మారాయి. ఇప్పటికే ప్రభుత్వంపై టీడీపీ నేతలు వివిధ అంశాలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేసారు. తాజాగా అచ్చెన్న వ్యవహారంలో ఏకంగా హత్యలు, కుట్రలంటూ ఆరోపించడం రాష్ర్ట ప్రజల్లో, రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.