Murali Mohan: ఇప్పుడు సినిమాలు తీయాలంటే ఆ పెద్ద హీరోల చుట్టూ డేట్స్ కోసం తిరగాలి: మురళీమోహన్

Murali Mohan: నిర్మాతగా 25 సినిమాలు చేసిన తాను రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత చేయడం మానేశానని నటుడు మురళీమోహన్ అన్నారు. అతడు సినిమా తర్వాత ఏ సినిమానూ చెయ్యలేదని, అదీ గాక ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు. ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెరిగిందని ఆయన చెప్పారు. ఇదివరకటి రోజుల్లో ఒక సినిమా ఫెయిల్ అయినా ఇంకో సినిమా చేసేవారమని, కానీ ఇప్పుడు పరిస్థితి దానికి భిన్నంగా ఉందని ఆయన చెప్పారు. ఇప్పుడైతే సినిమా హిట్ అయితే అందరూ దాన్ని పంచుకుంటారని, అదే ఫెయిల్ అయితే మాత్రం వేరేలా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

అదొక్కటే కాదు ఏదైనా సినిమా తీయాలనుకుంటే పెద్ద హీరోల డేట్స్ కోసం వాళ్ల చుట్టూ వందసార్లు తిరగాలి అని మురళీ మోహన్ అన్నారు. ఎందుకంటే ఒకప్పుడు తామంతా చిన్న సినిమాలే తీశామని, ఇప్పుడు కూడా చిన్న సినిమాలే చేస్తున్నామని, లో బడ్జెట్ సినిమాలే చేద్దామని అనుకుంటున్నామని ఆయన చెప్పారు.

ఇకపోతే తన బ్యానర్‌లో దాసరి గారికి అవకాశం ఇవ్వలేదని, కొత్త డైరెక్టర్‌కే అవకాశం ఇచ్చానని, దానికి ప్రత్యేకించి కారణం ఏమీ లేదని ఆయన చెప్పారు. ఆయనకు, తనకు మంచి సంబంధం ఉందని, కానీ తాను తక్కువ బడ్జెట్ ఉన్న సినిమాలే చేద్దామనుకున్నామని అందుకే వేరే వాళ్లకు ఛాన్స్ ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు.

ఇక మరో విషయానికొస్తే పౌరాణిక సినిమాలు మన తెలుగు వాళ్లు తీసినంత గొప్పగా ఇంకెవరూ తీయలేరని మురళీ మోహన్ అన్నారు. ఇక చేస్తే సోషల్ సినిమాలే చేయాలి అని, అవి చేయాలంటే పెద్ద హీరోలతో తీయాలని, దాని కోసం వారి డేట్స్ కలిసొచ్చేలా ప్లాన్ చేసుకోవాలని ఆయన చెప్పారు. తాను చిన్న స్థాయి నుంచి వచ్చానని, అందుకే చిన్న బడ్జెట్ సినిమాలే తీశానని ఆయన తెలిపారు. అందువల్ల రీమేక్‌లు చేయడం మొదలు పెట్టామని ఆయన చెప్పారు.