మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే చర్చ ప్రస్తుతం జోరుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గంలో మొత్తం 12 సార్లు ఎన్నికలు జరగగా ఎనిమిదిసార్లు ఇక్కడినుంచి రెడ్లు గెలవడం గమనార్హం. రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలను ఇక్కడి ప్రజలు ఎక్కువగా నమ్ముతున్నారు. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఈ నియోజకవర్గంలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఓటుహక్కు ఉన్నవాళ్ల జనాభా కేవలం 7,000 కావడం గమనార్హం.
ఇప్పుడు జరగనున్న ఉపఎన్నికలో బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఐదు శాతం రెడ్ల జనాభా ఉన్న ఈ నియోజకవర్గంలో లోకల్ గా ఉన్నవాళ్లు కూడా చాలా తక్కువని తెలుస్తోంది. కాంగ్రెస్, టీ.ఆర్.ఎస్. తరపున కూడా రెడ్డి అభ్యర్థులు పోటీ చేస్తే ఎన్నికల్లో అనుకూల ఫలితాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇక్కడ యాదవులు, మాదిగలు, ముదిరాజ్ లు, గౌడ్లు ఎక్కువగా ఉన్నారు.
మరోవైపు ఉపఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోల్ పర్సెంటేజ్ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గతంలో కూడా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అభ్యర్థులలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన వాళ్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. నాలుగు పర్యాయాలు వేరే సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులు ఎన్నికల్లో గెలవగా వారిలో మూడుసార్లు గెలిచిన అభ్యర్థి ఉజ్జిని నారాయణరావు కావడం గమనార్హం.
బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయని సర్వేలు చెబుతున్నా అదే సమయంలో టీ.ఆర్.ఎస్, కాంగ్రెస్ పార్టీలను కూడా తక్కువగా అంచనా వేయలేమనే సంగతి తెలిసిందే. మునుగోడు ఉపఎన్నికలో ఏ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వెలువడుతాయో చూడాల్సి ఉంది. పైకి చెప్పకపోయినా మునుగోడు ఉపఎన్నిక అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులను టెన్షన్ పెడుతుండటం గమనార్హం.