జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏపీలో మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. టీడీపీ హయాంలో అమరావతిని రాజధానిగా నియమిస్తూ అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు.
ఈ నిర్ణయానికి కొంచెం భిన్నంగా జగన్ మూడు రాజధానుల విధానాన్ని తెరపైకి తెచ్చారు. అయితే ఒకే రాష్ట్రానికి ఒకటి కంటే ఎక్కువ రాజధానులు ఉండాలనే అంశం ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో కూడా మొదలైంది. ఆంధ్రప్రదేశ్ పక్కన ఉన్న తమిళనాడులో కూడా తాజాగా రెండు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీకి చెందిన మంత్రి ఉదయ్ కుమార్ ఈ కొత్త ప్రతిపాదనకు పురుడుపోశాడు.
మంత్రి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ…చెన్నైలో నిత్యం వరదలు వర్షాలు వస్తున్నాయి. ఎండాకాలంలో కరువు కాటకాలు తీవ్రమవుతున్నాయి. కాబట్టి తమిళనాడుకు వెంటనే మధురైని రెండో రాజధానిగా ప్రకటించారు. దీంతో ప్రజలకు ఇబ్బంది లేకుండా పాలన ఉంటుందని తెలిపారు. దీనికి పలువురు నేతలు కూడా మద్దతు తెలిపారు. మంత్రి వ్యాఖ్యలను సమర్థిస్తూ తమిళనాడులో చాలామంది మధురైని రెండో రాజధానిగా నియమించాలని సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.
జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం సరైనది కాబట్టే పక్క రాష్ట్రాల నేతలు కూడా పాటిస్తున్నారని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అభివృద్ధి విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు దేశానికే ఆదర్శమని వైసీపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. జగన్ మూడు రాజధానుల అంశం ఏపీలోని కాకుండా ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో కూడా సెగలు పుట్టిస్తుంది. ప్రశాంత సాగుతున్న తమిళ రాజకీయాల్లో ఈ రెండు రాజధానుల నిర్ణయం ఎక్కడిదాక వెళ్తుందో వేచి చూడాలి. ఏపీ మూడు రాజధానుల బిల్లుపై హై కోర్ట్ స్టేటస్ కో ను ఈనెల 27 వరకు పొడగించిన విషయం తెలిసిందే. రాజధాని విషయంలో వస్తున్న అడ్డంకులను జగన్ రానున్న రోజుల్లో ఎలా ఎదురుకొంటారోనని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.