అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఇప్పటికే నిష్క్రమించిన మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ, తాజాగా ఐపీఎల్ టైటిల్‌ని చెన్నయ్ జట్టుకి అందించాడు. చెన్నయ్ జట్టుకి టైటిల్స్ అందించడం ధోనీకి కొత్త కాదు. కానీ, ఈసారి టైటిల్ వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే, గత సీజన్‌లో ధోనీ పేలవమైన ప్రదర్శన ఇచ్చాడు. దాంతో, జట్టు లీగ్ దశని దాటలేకపోయింది.
ఈసారి కూడా అలాగే జరుగుతుందా.? అన్న అనుమానాలు అభిమానుల్లో వున్నాయి. ‘మా జట్టులో కుర్రాళ్ళను సెట్ చేసుకుని వస్తాను..’ అంటూ గత సీజన్ వైఫల్యం తర్వాత ధోనీ వ్యాఖ్యానించాడు. అది సాధ్యమయ్యే పనేనా.? అన్న భావన సీఎస్కే అభిమానుల్లో వుండేది కొత్త సీజన్ మొదలయ్యేవరకూ.
కానీ, క్రికెట్‌లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ధోనీ, ప్రత్యేకించి ఐపీఎల్‌లో ఎప్పటికప్పుడు మరింత సంచలనాలతో సత్తా చాటుతూనే, తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ‘మేం గెలిచాం.. కానీ, నిజానికి వాస్తవ గెలుపు కోల్‌కతా జట్టుదే..’ అంటూ ధోనీ వ్యాఖ్యానించడం ఆయన ప్రత్యేకతకు మరో గీటురాయి.
చెన్నయ్ జట్టులో అందరూ బాగా ఆడారు. కానీ, వారిని ముందు నడిపించిన నాయకుడు ఎమ్మెస్ ధోనీ. టీమిండియా విషయంలోనూ ధోనీ వ్యూహాలు అలాగే పనిచేసేవి. అందుకే, ధోనీ సారధ్యంలో టీమీండియా ఎన్నో అద్భుతాలు చేసింది.
‘ధోనీ, ఈసారికి టీ20 వరల్డ్ కప్ కూడా ఆడెయ్యొచ్చు కదా..’ అని అభిమానులు కోరుతున్నారిప్పుడు. ధోనీ నాయకత్వ లక్షణాలు అలాంటివి. అయితే, ధోనీ మాత్రం, టీ20 వరల్డ్ కోసం టీమిండియాకి మెంటర్‌గా మాత్రమే సేవలందిస్తాడు. అంటే, మైదానం వెలుపల ధోనీ సహాయ సహకారాలు టీమిండియాకి వుండబోతున్నాయన్నమాట.
క్రికెట్‌లో ధోనీ ఎన్నో ఘనతలు సాధించాడు.. ఇంకా ఇంకా సాధిస్తూనే వున్నాడు.. అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పేశాక కూడా ధోనీ మేనియా తగ్గలేదు. టీ20 వరల్డ్ కప్ పోటీల్లో ధోనీ నేరుగా మైదానంలోకి దిగకపోయినా, ధోనీ ఖచ్చితంగా ఏదో సంచలనమైతే సృష్టిస్తాడు. దటీజ్ ధోనీ.