వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటికే ఆయన వైసీపీ పార్టీ మీద, ఆ పార్టీ నాయకుల మీద ఎన్నో విమర్శలు చేశారు. వైసీపీలోనే ఉండి.. వైసీపీ పార్టీకి ఎదురు తిరిగి రెబల్ ఎంపీగా పేరు పొందారు రఘురామకృష్ణంరాజు. తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కోర్టు ధిక్కరణ కేసు కింద సీఎం జగన్.. తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి రావొచ్చంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదివరకు కూడా మాజీ ముఖ్యమంత్రులు.. నీలం సంజీవరెడ్డి, జనార్ధన్ రెడ్డి… తన పదవులకు రాజీనామా చేశారు. ఇప్పుడు జగన్ కు త్వరలోనే కోర్టు ధిక్కరణ నోటీసులు రానున్నాయి. ఆ నోటీసులు తీసుకోవడానికి జగన్ సిద్ధంగా ఉండాలి.. అంటూ రఘురామ తెలిపారు.
జగన్ కు ఎప్పుడెప్పుడు నోటీసులు వస్తాయా? అని వైసీపీలో ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే.. ఈ విషయంపై జగన్.. కోర్టుకు క్షమాపణ చెబితే మాత్రం ఆయనకు శిక్ష తప్పుతుంది.. అంటూ తెలిపారు.
జడ్జిల తీర్పుల మీదనే అనుమానాలు వ్యక్తం చేయడం అనేది ఎక్కడా చూడలేదని.. దీని వల్ల న్యాయవ్యవస్థను రోడ్డు మీదికి ఈడ్చడం జరిగింది తప్పితే.. ఇక్కడ జరిగింది ఇంకేమీ లేదన్నారు. నిజంగా వాళ్లకు చిత్తుశుద్ధి ఉంటే.. ఇలా చేసేవాళ్లు కాదన్నారు. మీడియా ముందు రచ్చరచ్చ చేయడంతోనే వైసీపీ నేతల అసలు ఉద్దేశం బయటపడిపోయింది.. అంటూ రెబల్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు.