MP Raghurama : నర్సాపురం ఎంపీ, వైసీపీ రెబల్ నేత రఘురామకృష్ణరాజు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన బారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తారంటూ చాలాకాలంగా ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోన్న సంగతి తెలిసిందే.
అయితే, టీడీపీ – బీజేపీ మధ్యన ఆయన రాజకీయ ప్రయాణం ఊగిసలాడుతోంది. సందర్భానుసారం టీడీపీకీ, బీజేపీకి రఘురామ తన మాటలతో లబ్ది చేకూరుస్తున్నారు. టీడీపీ మీద పెద్దగా విమర్శలు చేయడంలేదుగానీ, ప్రత్యేక హోదా వంటి విషయాల్లో బీజేపీని రఘురామ గట్టిగానే ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా వుంటే, ఢిల్లీ స్థాయిలో రఘురామకు బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రధాని సహా కేంద్ర మంత్రెలవర్నయినా తేలిగ్గా కలవగలిగేంత పలుకుబడి కూడా వుంది. ఇదే రాజుగారికి పెద్ద అడ్వాంటేజ్. ఎప్పటికప్పుడు ఆయా ప్రముఖులతో తనకున్న సంబంధాల్ని మరింత బలోపేతం చేసుకుంటుంటారు రఘురామ.
ఇదిలా వుంటే, జనసేనలో చేరాలని రఘురామ నిర్ణయించుకున్నారంటూ తాజాగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై జనసేన వర్గాల్లో ఒకింత అలజడి కూడా బయల్దేరింది. ఎందుకంటే, వైసీపీ నుంచి గెలిచి.. ఆ పార్టీకి దూరమైన రఘురామ, రేప్పొద్దున్న జనసేనలో చేరితో ఎలా వుంటారోనన్న అనుమానం జనసైనికులకు కలగడంలో వింతేముంది.?
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి తాను పోటీ చేయాలన్నదానిపై ఇంకా నిర్ణయించుకోలేదనీ, తానింకా వైసీపీ నాయకుడినేననీ రఘురామ చెబుతుండడం గమనార్హం.