బ్యాంకులు జగన్ ప్రభుత్వాన్ని నమ్ముతాయా.? ఎంపీ రఘురామ నమ్ముతాయా.?

 

ప్రభుత్వాలు అప్పులు చేయడం అన్నది ఈ రోజుల్లో సర్వసాధారణం. గత ప్రభుత్వం, అంతకు ముందు ప్రభుత్వం కంటే ఎక్కువ అప్పులు చేసింది. ప్రస్తుత ప్రభుత్వం, గత ప్రభుత్వం కంటే ఎక్కువ అప్పులు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలో ఎక్కడ చూసుకున్నా ఇదే పరిస్థితి. కేంద్రంలోని మోడీ సర్కార్ చేస్తున్నదేంటి.? ఆంధ్రప్రదేశ్ అప్పుల విషయంలోనే కనీ వినీ ఎరుగని రీతిలో రచ్చ జరుగుతోంది. నిజమే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తున్న అప్పులు వివాదాస్పదమవుతున్నాయి. ఆదాయ మార్గాలు తక్కువగా వుండడంతో, అప్పులు ఎక్కువగా చేయాల్సి వస్తోంది. దీనికి కారణం ఎవరు.? రాష్ట్రాన్ని అప్పుల కూపంలోకి నెట్టేసేలా విడదీసిందెవరు.? దానికి సహకరించిందెవరు.? ఇలాంటి అంశాలన్నీ చర్చకు రావాల్సిందే. కేంద్రమే, రాష్ట్రాన్ని ఆదుకోవాలి. కానీ, కేంద్రం ఆదుకోవడంలేదు. రాష్ట్రం తనంతట తాను అప్పులు చేస్తోంటే అడ్డు తగులుతోంది కేంద్రం.

తాజాగా, ఈ గొడవలో తల దూర్చారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. బ్యాంకులు, ప్రభుత్వానికి అప్పులు ఇవ్వొద్దంటూ ఉచిత సలహా ఇచ్చేశారు. బ్యాంకులు, ఓ ఎంపీ మాటని వింటాయా.? ఓ ప్రభుత్వాధినేత విన్నపాన్ని మన్నిస్తాయా.? సింపుల్ లాజిక్ ఏంటంటే, ప్రభుత్వం మాటే బ్యాంకులు వింటాయి, వినాలి కూడా. అయినా, రాష్ట్రానికి అప్పులు దొరక్కపోతే, రాష్ట్రం ఏమైపోతుందోనన్న కనీస ఇంగితం లేని వ్యక్తి ఎంపీ పదవిలో కొనసాగడమేంటి.? అన్న ప్రశ్న రఘురామ మీదకు దూసుకెళుతోంది. రాష్ట్రం చేస్తున్న అప్పులపై కేంద్రానికి ఇప్పటికే ఫిర్యాదు చేశారు రఘురామకృష్ణరాజు. రాష్ట్రం అప్పుల సంగతి తర్వాత, బ్యాంకుల్ని ముంచేశారన్న ఆరోపణలపై రఘురామ తొలుత సమాధానం చెప్పుకోవాలి. చేతనైతే రాష్ట్ర అభివృద్ధికి ఓ ఎంపీగా సహకరించాలి తప్ప, రాష్ట్రానికి అప్పులు ఇవ్వొద్దని బ్యాంకులను కోరడం పైశాచికత్వం కాక మరేమిటి.?