బలాబలాల ద్రుష్ట్యా టీడీపీకి, వైసీపీకి చాలా వ్యత్యాసం ఉంది. 25 ఎంపీ స్థానాల్లో వైసీపీ 22 గెలుచుకుంటే టీడీపీ కేవలం 3 స్థానాలకే పరిమితమైంది. 22, 3.. ఈ తేడా చాలా పెద్దది. 22 మంది ఎంపీలను 3 ఎంపీలు ఎదుర్కోవడం అంటే చాలా కష్టం. కానీ టీడీపీ ఎంపీలు ముగ్గురు మాత్రం గట్టిగానే పోరాడుతున్నారు. టీడీపీ నుండి గెలిచిన రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, కేశినేని నాని.. ముగ్గురు కూడా గట్టివాళ్లే. మంచి విద్యావంతులు. రాష్ట్ర స్థితి గతుల మీద అవగాహన ఉన్న వాళ్లు. కాబట్టే అధికార పక్షం నుండి వస్తున్న పోటీని తట్టుకోవడమే కాకుండా ఎదురుదాడి కూడా చేస్తున్నారు. రామ్మోహన్ నాయుడు ఈమధ్య జరిగిన అచ్చెన్నాయుడు ఆరెస్ట్ విషయంలో వైసీపీ మీద పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. అయన్ను తట్టుకోవడం వైసీపీ నేతల వల్ల కాలేదు.
అలాగే గల్లా జయదేవ్ సైతం వైసీపీ మీద గట్టిగా యుద్దం చేస్తున్నారు. అమరరాజ గ్రూప్ భూములను ప్రభుత్వం వెనక్కు తీసుకుంటే కోర్టుకు వెళ్ళి మరీ స్టే తెచ్చారు. కరోనా విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపణలు చేశారు. ఇప్పుడు వీరిద్దరినీ మించేలా ఎంపీ కేశినేని నాని అధికార పక్షం మీద దాడికి దిగారు. విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్ విషయంలో క్రెడిట్ దక్కించుకోవాలని వైసీపీ ట్రై చేయగా నేరుగా వెళ్లి గడ్కరీని కలిసి వారి ఆశల మీద నీళ్లు చల్లారు. గతంలో కూడా అధికార పార్టీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ మీద వసూళ్ల ఆరోపణలతో విరుచుకుపడ్డారు.
ఇక తాజాగా నాని వైఎస్ జగన్ మీద విరుచుపడి అందరి దృష్టిలో పడ్డారు. సీఎం వైఎస్ జగన్ పచ్చి మోసకారని వ్యాఖ్యానించిన కేశినేని 22 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్ ఇప్పుడు మాట్లాడటం లేదు. కేసుల నుండి బయటపడటానికి కేంద్రంతో లాబీయింగ్ చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు. సీఎం సీటు జగన్‌కు శాశ్వతం కాదు. హిట్లర్ లాంటి వాళ్లే కాలగర్భంలో కలిశారు. జగన్ మోహన్ రెడ్డి చరిత్ర అంతకంటే హీనమైంది. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తే ప్రజలు తగిన సమయంలో బుద్ది చెప్తారు. చంద్రబాబు మీద నమ్మకంతో ఆనాడు రైతులు రాజధాని కోసం 33 వేల ఎకరాలు ఇచ్చారు. ఇప్పుడేమో అమరావతినే లేకుండా చేస్తున్నారు అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.