మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంట్‌లో మాట్లాడితే తనపై యాసిడ్ పోస్తానని.. జైలుకు పంపుతామని శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తనను బెదిరించారని నటి, అమరావతి స్వతంత్ర ఎంపీ నవనీత్ కౌర్ రానా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, తనపై యాసిడ్ దాడి చేస్తామని బెదిరింపు కాల్స్‌తో పాటు శివసేన పార్టీ లెటర్ హెడ్‌తో కూడిన లేఖలు వచ్చినట్టు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు నవనీత్ కౌర్ ఫిర్యాదు చేశారు. అయితే, నవనీత్ కౌర్ ఆరోపణలను ఎంపీ అరవింద్ సావంత్ ఖండించారు.
‘శివసేన పార్లమెంట్ సభ్యుడు అరవింద్ సావంత్ బెదిరించారు.. ఇది కేవలం నాకు జరిగిన అవమానం మాత్రమే కాదు, దేశంలోని మహిళలందరికీ జరిగిన అవమానం.. అరవింద్ సావంత్‌పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి’ అని నవనీత్ కౌర్ డిమాండ్ చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల గురించి పార్లమెంట్‌లో ప్రస్తావించడం పట్ల సావంత్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు నవనీత్ కౌర్ పేర్కొన్నారు. ‘నువ్వు మహారాష్ట్రలో ఎలా తిరుగుతావో చూస్తా… నిన్ను జైల్లో వేసి నీ చేత ఊచలు లెక్కబెట్టిస్తాం’ అని అరవింద్ సావంత్ తనను లోక్‌సభ లాబీలో బెదిరించినట్లు తెలిపారు. ‘ఆయన మాటలకు నాకు మతిపోయినట్లయ్యింది. ఒక్కసారిగా సావంత్‌వైపు తిరిగాను.. నా పక్కనే మరో ఎంపీ ఉన్నారు.. ‘సావంత్ మాటలను మీరు విన్నారా’ అని ఆయనను అడిగితే.. ‘విన్నాను’ అని చెప్పారు’ అంటూ నవనీత్ తాను ఎదుర్కొన్న బెదిరింపుల ఘటనను వివరించారు.
సావంత్ బెదిరించినప్పుడు నవనీత్ కౌర్ పక్కన రాజమండ్రి వైఎస్ఆర్సీపీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఉన్నట్లు న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐ వెల్లడించింది. ‘పోలీసులు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేయడానికి ముందు శివసేన పేరుతో బెదిరింపులు లేఖలు వచ్చాయి. అంతేకాక ‘‘ఉద్ధవ్ ఠాక్రే గురించి మాట్లాడుతున్నావ్ కదా.. నీకు అందమైన ముఖం ఉందని మురిసిపోతున్నావు.. దానిపై యాసిడ్ పోస్తే ఎక్కడకీ తిరగలేవు అంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌లు చేశారు’ అని నవనీత్ ఆరోపించారు. అరవింద్ సావంత్ నవనీత్ ఆరోపణలపై స్పందించారు. ‘నా జీవితంలో ఎవరినీ ఇప్పటి వరకూ బెదిరించలేదు.. అలాంటిది ఓ మహిళను నేను బెదిరించడం ఏంటి’ అన్నారు.