No Responsibility For MAA : ఆంధ్రప్రదేశ్‌ సినిమా టిక్కెట్ల రగడ: ‘మా’కి సంబంధం లేదా.?

No Responsibility For MAA : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్‌కి సంబంధించి అన్నీ తానే అయి అనేక ‘వ్యవహారాలు’ నడిపించిన సీనియర్ నటుడు నరేష్, ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్ల వ్యవహారానికి సంబంధించి ‘మా’కి ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. ‘ఆ విషయం పరిశ్రమ పెద్దలు చూసుకుంటున్నారు..’ అంటూ సెలవిచ్చాడు నరేష్.

సినిమా టిక్కెట్ల వ్యవహారం నిర్మాతలకు సంబంధించినది, డిస్ట్రిబ్యూటర్లు అలాగే ఎగ్జిబిటర్లకు సంబంధించినది. అంతేనా.? సినిమా అంటే, అది అందరిదీ. సినిమా కోసం అన్ని విభాగాలూ పనిచేస్తాయి. సినిమాకి నష్టం కలుగుతుందంటే, సినిమా తరఫున అందరూ మాట్లాడాలి. సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరూ గళం విప్పాలి.

సరే, వైఎస్ జగన్ సర్కారు సినిమా టిక్కెట్ల విషయమై తీసుకున్న నిర్ణయం సబబా.? కాదా.? అన్నది వేరే చర్చ. సమస్య అయితే వచ్చింది. కొన్ని సినిమాలు జగన్ సర్కారు నిర్ణయం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ‘శ్యామ్ సింగారాయ్’ సినిమా అలా ఇబ్బందిని ఎదుర్కొన్నదే.

మరి, నటుడు నాని ఈ విషయమై స్పందించినప్పుడు, ‘మా’ ఎందుకు స్పందించలేదు.? ‘మా’ ఎన్నికల నేపథ్యంలో దేశ రాజకీయాలు చర్చకు వచ్చాయి. కులం, మతం, ప్రాంతం.. ఇలా అన్ని అంశాల చుట్టూ ‘మా’ రాజకీయాన్ని తిప్పారు. అలా తిప్పినవారిలో నరేష్ కూడా ముఖ్యుడే.

‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కూడా ఇప్పటిదాకా ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవలేదు. మంచు విష్ణు తండ్రి మోహన్‌బాబు సైతం చొరవ చూపించలేకపోయారు. మరెందుకు ‘మా’ పదవి.? అన్న ప్రశ్న వస్తోంది. అసలు ‘మా’ వల్ల సినీ పరిశ్రమకి ఏంటి ఉపయోగం.? అన్న చర్చ కూడా జరుగుతోంది సినీ పరిశ్రమలో.