నిర్మాతల మండలి నుంచి సురేశ్‌ కొండేటి బహిష్కరణ!

మామూలు స్థాయి నుంచి అగ్రనటుడు చిరంజీవి సహకరాంతో నిర్మాతగా ఎదిగిన సురేశ్‌ కొండేటిని నిర్మాతల మండలి బహిష్కరించింది. నిర్మాతల మండలి నుండి, తెలుగు ఫిలిం ఛాంబర్‌ నుండి అధికారికంగా బహిష్కరించినట్టు తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి ప్రసన్న కుమార్‌ చెప్పారు. ఇప్పుడు అతను ఇక దేనిలోనూ సభ్యుడు కాడని, నిర్మాతగా, తెలుగు ఫిలిం ఛాంబర్‌ అఫ్‌ కామర్స్‌ సభ్యుడిగా, ఇంతవరకు అతను పొందిన రాయితీలు ఇకముందు నుండీ ఏవీ అతనికి ఇక రావని తెలిసింది. అతని తీరుతో చిత్రపరిశ్రమ తలెత్తుకోలేని దశకు వచ్చిందని భావిస్తున్నారు.

ఇటీవల అగ్రనిర్మాత అల్లు అరవింద్‌ కూడా ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..అతనికి తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌ మా అధ్యక్షుడు విష్ణు మంచు న్యూజిలాండ్‌లో తన సినిమా ‘కన్నప్ప’ షూటింగ్‌ లో బిజీగా ఉన్నందు వలన హైదరాబాదు వచ్చాక, సురేష్‌ కొండేటి విూద ఎటువంటి చర్య తీసుకోవాలనేది నిర్ణయం జరుగుతుందని తెలుస్తోంది. అక్కడ కూడా అతన్ని మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) నుండి బహిష్కరించే అవకాశాలు వున్నట్టుగా తెలిసింది.

సంతోషం పత్రిక నడుపుతున్న సురేష్‌ కొండేటి గోవాలో నిర్వహించిన అవార్డుల వేడుక చాలా గందరగోళానికి గురవటమే కాకుండా, ఆ వేడుకకి వచ్చిన తెలుగు సినిమా సెలబ్రెటీలు, ఇతర భాషా నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఎంతో ఇబ్బంది పడ్డారు. అవార్డుల వేడుకకు వచ్చిన అతిధులందరికీ ఎంతో అవమానం కూడా జరిగిందని తెలిసింది. ఈ వేడుక జరిపిన సురేష్‌ కొండేటి అవార్డుల వేడుక మధ్యలోనే బయటకి వెళ్ళిపోయినట్టుగా తెలుగు ఫిలిం ఛాంబర్‌ అఫ్‌ కామర్స్‌ ఒక ప్రకటనలో చెప్పింది.

సురేష్‌ కొండేటి చేసిన కొన్ని తప్పుడు ప్రచారాల వలన ఎంతో చెడ్డ పేరు రావటంతో,సంజాయిషీ కోరుతూ తెలుగు ఫిలిం ఛాంబర్‌ అఫ్‌ కామర్స్‌, తెలుగు నిర్మాతల మండలి ఒక నోటీసు ఇచ్చినా తలబిరుసుతో జవాబు కూడా ఇవ్వలేదని తెలిసింది. నిర్మాతల మండలిలో చర్చించిన పిదప అందరూ ఏకగ్రీవంగా సురేష్‌ కొండేటిని బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.