సినిమా థియేటర్లు తెరచుకోనున్నాయ్.. అనే వార్తతో ఒక్కసారిగా సినీ పరిశ్రమలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అదేంటో, ఆ ఉత్సాహం ప్రేక్షకుల్లో అస్సలు కనిపించడంలేదు. కొంతమంది మాత్రమే, సినిమా థియేటర్లు తెరవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా నేపథ్యంలో రెండోసారి థియేటర్లకు తాళం పడగా, కొన్ని నిబంధనల్ని విధిస్తూ.. సినిమా థియేటర్లను తిరిగి తెరిచేందుకు ప్రభుత్వాలు సుముఖత వ్యక్తం చేశాయి. నిజానికి, తెలంగాణ ప్రభుత్వం గతంలోనే సినిమా థియేటర్లు తెరిచేందుకు అనుమతినిచ్చింది.
మల్టీప్లెక్సులు ఎలాగోలా నిలదొక్కుకుంటాయేమోగానీ, సింగిల్ థియేటర్ల పరిస్థితి మాత్రం అత్యంత దయనీయం. ఏడాదిన్నర సంక్షోభమిది.
ఈ సంక్షోభం నుంచి గట్టెక్కడం సినిమా థియేటర్లకు అంత తేలిక కాదు. అదే సమయంలో, సినీ పరిశ్రమ మొత్తంగా తీవ్ర సంక్షోభాన్ని చవిచూసింది. ఓటీటీ దెబ్బకు చాలామంది నిర్మాతలు లాభాల్ని కోల్పోయి, నష్టాల్ని చవిచూశారు..ఇంకా నష్టాల్ని చవిచూస్తూనే వున్నారు.
థియేటర్లు తిరిగి ప్రారంభించబోతున్నారు సరే.. మూడో వేవ్ భయాల సంగతేంటి.? సినిమా పరిశ్రమ అంటేనే అద్దాల మేడ లాంటిది.
ఏ చిన్నరాయి తగిలినా అంతే సంగతి. సినిమా థియేటర్లు తిరిగి తెరవడం కూడా అంతే. చిన్న అనుమానం మళ్ళీ కరోనా వైరస్ విషయంలో బయల్దేరితే.. మళ్ళీ సమస్య మొదటికి వచ్చేస్తుంది. అందుకే, సినిమా రిలీజుల విషయంలో దర్శక నిర్మాతలు తొందరపడే పరిస్థితి లేదు.
జనం, థియేటర్లకు నిర్భయంగా వస్తేనే.. థియేటర్లలో బొమ్మ పడటం వల్ల సినీ పరిశ్రమకి కాస్తో కూస్తో ఊరట. ప్రభుత్వాలు పూర్తిగా సినీ పరిశ్రమను ఆదుకోవాలి. వెసులుబాట్లు కల్పించాలి.. పన్నుల నుంచి ఉపశమనాన్నివ్వాలి. ఇవేవీ జరగకండా థియేటర్లు తెరిస్తే.. అదో అదనపు భారమవుతుంది సినీ పరిశ్రమ మీద.