డబుల్ మ్యుటేషన్లంటున్నారు.. రీ-ఇన్ఫెక్షన్లంటున్నారు.. అసలేంటి కథ.? దేశంలో కరోనా సెకెండ్ వేవ్ ఎంత ప్రమాదకరం.? ‘అబ్బే, భయపడాల్సిన పనేమీ లేదు..’ అని ఎవరన్నా చెబితే, అంతకన్నా బాధ్యతారాహిత్యం ఇంకోటుండదు. నిన్న ఒక్కరోజే దేశంలో రెండు లక్షల అరవై వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. నిజానికి, దేశంలో ఇంకా జరగాల్సిన స్థాయిలో వేగంగా కరోనా నిర్ధారణా పరీక్షలు జరగడంలేదు. దాంతో, కరోనా తీవ్రత.. మనం చూస్తున్నదానికంటే చాలా చాలా ఎక్కువగానే వుందని భావించాలేమో. ప్రైవేటు ఆసుపత్రులకు కరోనా.. అంటే పెద్ద పండగే. లక్షల్లో ఫీజులు దొచేస్తున్నాయి.
ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలపై భిన్నవాదనలున్నాయి. అయితే, ప్రైవేటు కంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కోవిడ్ 19కి మెరుగైన చికిత్స జరుగుతోందన్నది నిర్వివాదాంశం. అయినాగానీ, బాధితులు.. తొలుత ప్రభుత్వాసుపత్రుల వైపు వెళ్లడంలేదు. అదే అసలు సమస్యకు కారణంగా కనిపిస్తోంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో పరిస్థితి విషమించాక, ప్రభుత్వ ఆసుపత్రుల్ని ఆశ్రయిస్తున్నారు. దాంతో, ప్రభుత్వాసుపత్రుల్లో మరణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదిలా వుంటే, దేశంలో అత్యంత ప్రమాదకరమైన స్థితిలో కరోనా వ్యాప్తి పెరుగుతున్నా, వినోద సంబంధిత కార్యక్రమాలేవీ ఆగడంలేదు. రాజకీయ కార్యక్రమాల సంగతీ సరే సరి. నిజానికి, ఎప్పడో ఈ రెండు విభాగాలపై ప్రత్యేకంగా కన్నేసి, వాటిని ముందుగా నిలుపుదల చేసి వుండాల్సింది. ప్రస్తుతం పరిస్థితి చెయ్యదాటిపోయింది. మరెలా.? భయపడాల్సిందే, భయపడి తీరాల్సిందే.. ఆ భయంతోనే స్వీయ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కరోనా కంటే ప్రమాదకరమైన భూతం.. కరోనా పేరుతో జరుగుతున్న దోపిడీ. ఈ దోపిడీని ప్రభుత్వాలు అరికట్టగలిగితే, సామాన్యుడు బతికి బట్టకడతాడు.