వైఎస్ షర్మిల … రాజన్న రాజ్యం తెస్తానంటూ తెలంగాణలో పొలిటిక్ ఎంట్రీ ఇచ్చిన జగన్ సోదరి ఇప్పుడు సోషల్ మీడియా లో టాప్ లో ట్రెండ్ అవుతున్నారు. కొత్త పార్టీ ఏంటి? జెండా ఎలా ఉంటుంది? ఎప్పుడు ప్రకటిస్తారు? అనే దానిపై హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. ఐతే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఏప్రిల్ 10న కొత్త పార్టీ ప్రకటనకు వైఎస్ షర్మిల ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 10 వైఎస్ ఫ్యామిలీకి చాల ముఖ్యమైన రోజు.
2003లో ఇదే రోజున వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేవెళ్లలో పాదయాత్ర ప్రారంభించారు. ఆ పాదయాత్రే 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బాటలు వేసింది. అందుకే ఆ రోజు న కొత్త పార్టీ ప్రకటన ఉండబోతుంది అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 10న బహిరంగ సభ ఏర్పాటు చేసి తాను పెట్టబోయే కొత్త పార్టీ పేరును షర్మిల ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు అవసరమైతే అదే చేవెళ్ల నుంచి షర్మిల పాదయాత్ర కూడా ప్రారంభిస్తారన్న చర్చ కూడా జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణలో ఉమ్మడి జిల్లా వారీగా ఆత్మీయ సమ్మేళనాలను షర్మిల ప్రారంభించారు.
ఆ లోపు పార్టీకి విధి విధానాలు, జెండాను ఖరారు చేయాలని యోచిస్తున్నారు. షర్మిల పార్టీ పేరులో వైఎస్‌తో పాటు తెలంగాణ పదాలు వచ్చేలా చూస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని తన నివాసంలో వైఎస్సార్ అభిమానులతో షర్మిల ఆత్మీయ సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రాజన్న రాజ్యం లేదని వ్యాఖ్యానించిన షర్మిల.. రాజన్న రాజ్యం ఎందుకు రాకూడదు అని ప్రశ్నించారు. తెలంగాణలోని అన్ని జిల్లాల నేతలతో మాట్లాడతానని చెప్పారు. పార్టీ పెట్టే ముందుకు అభిమానులకు చెప్పానని తెలిపారు. అయితే షర్మిల పార్టీ ఏర్పాటు వార్తలపై ఇప్పటికే పలు పార్టీల నేతలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.