పాన్ తినకుండా ప్రాణాలు కాపాడుకున్నా… చంపాలని విష ప్రయోగం చేశారు: బాబు మోహన్

అలనాటి హాస్యనటుడు బాబు మోహన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాలలో ఆయన వేసే పాత్రలు, ఆయన చేసే కామెడీ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. వెండితెర మీద మాత్రమే కాకుండా ప్రస్తుతం బుల్లితెర మీద కూడా బాబు మోహన్ సందడి చేస్తున్నాడు. సినిమాలు సీరియల్స్ తో బిజీగా ఉన్న బాబు మోహన్ ఒకప్పుడు రాజకీయాలలో కూడా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం బాబు మోహన్ “ఆ ఒక్కటి అడక్కు” అని సీరియల్ లో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాకుండా అప్పుడప్పుడు బుల్లితెర మీద ప్రసారం అవుతున్న కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ సందడి చేస్తున్నాడు. అంతేకాకుండా మళ్లీ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బాబు మోహన్ సినిమా విశేషాలతో పాటు తన పర్సనల్ లైఫ్ గురించి కూడా ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఈ క్రమంలో గతంలో అతని మీద జరిగిన హత్యాయత్నం గురించి కూడా ఈ సందర్భంగా బాబు మోహన్ బయట పెట్టాడు. ఇంటర్వ్యూలో బాబు మోహన్ మాట్లాడుతూ గతంలో ఢిల్లీలో ‘వన్స్‌మోర్‌’ అనే సినిమా షూటింగ్‌ చేస్తున్న సమయంలో ఒకరోజు సెట్స్‌లో తనికెళ్ల భరణి పాన్‌ తింటున్నాడు. ఆ సమయంలో నన్ను కూడా ఒకటి రుచి చూడమన్నాడు. అంతకు ముందు నేనెప్పుడు పాన్ తినలేదు. ఆయన చెప్పారని ఒకటి నోట్లో పెట్టుకున్నా, కానీ ఆ రుచి నచ్చక ఉమ్మేసాను అంటూ చెప్పుకొచ్చాడు.

కానీ తర్వాతి రోజు నుంచి నేనే వెళ్లి స్వయంగా ఒక పాన్‌ ఇవ్వమని అడిగేవాడిని. అలా పాన్ కి అలవాటు పడిన నేను ఒకానొక దశలో రోజుకు 30 నుంచి 40 దాకా పాన్‌లు తినేవాడిని. ఈ క్రమంలో సంగారెడ్డి వచ్చానంటే అక్కడ ఓ డబ్బాలో కచ్చితంగా పాన్‌ తినేవాడిని. అయితే నేను అక్కడ రెగ్యులర్ గా పాన్‌ తీసుకుంటున్న సంగతి తెలిసిన కొందరు ఓసారి అందులో విషాన్ని కలిపారు. నేను ఆ డబ్బా దగ్గరకు వెళ్లి పాన్‌ తీసుకుని వెళ్ళిపోయాను.. తిందామనుకునే సమయానికి ఫోన్‌ వచ్చింది. దయచేసి పాన్‌ తినకండి, అందులో విషం ఉందని చెప్పారు. వెంటనే పాన్‌ పక్కన పడేశాను. వెంటనే మరో ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఈసారి పాన్‌ కట్టే వ్యక్తి భార్య మాట్లాడుతూ.. పొరపాటు జరిగింది సార్‌, విషం కలిపిన పాన్‌ ఇవ్వమని ఎవరో మమ్మల్ని ఒత్తిడి చేశారంటూ ఏడ్చింది..అంటూ బాబూ మోహన్ తనమీద జరిగిన హత్యా ప్రయత్నం గురించి బయటపెట్టాడు.