నాన్న మరణం నాకు పెద్ద షాక్… దేశం కోసం ఆడాలనే ఆయన కోరికని తీర్చాను: మహమ్మద్ సిరాజ్

mohammed siraj lost his father on friday

మహ్మద్ సిరాజ్ ఐపీఎల్ లో బెంగళూరు జట్టులో ఆడుతున్న మన హైదరాబాద్ కుర్రోడు. అతను ఒక ఆటో డ్రైవర్ మహ్మద్ ఘౌస్ కొడుకు. ఐపీఎల్ వేలంలో రూ.2.6 కోట్లకి అమ్ముడుపోవడం అనేది అప్పట్లో ఒక సంచలనం. 2020 సీజన్‌లో ఒక మ్యాచ్‌లో చేసిన అద్భుత ప్రదర్శనతో మహ్మద్ సిరాజ్ పేరు మార్మోగిపోయింది. అప్పటి వరకూ మ్యాచ్‌ల్లో ధారాళంగా పరుగులిచ్చేసి ఓటమికి కారణమవుతున్న క్రికెటర్‌గా మాత్రమే వార్తల్లో నిలిచిన సిరాజ్.. తొలిసారి తన బౌలింగ్‌ ప్రదర్శనతో పత్రికల్లో అదీ పతాక శీర్షికలో నిలిచాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో తొలి రెండు ఓవర్లనీ మెయిడిన్‌గా వేసిన సిరాజ్.. రెండు బ్యాక్ టు బ్యాక్ వికెట్లు పడగొట్టాడు. 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఓ బౌలర్ వరుసగా రెండు ఓవర్లని మెయిడిన్‌గా వేయడం అదే తొలిసారి కాగా.. ఆ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి 8 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.దాంతో భారత సెలెక్టర్ల నుంచి ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ కోసం పిలుపు వచ్చింది.

mohammed siraj lost his father on friday
mohammed siraj lost his father on friday

దేశం తరఫున సిరాజ్ మ్యాచ్‌లు ఆడాలనేది అతని తండ్రి మహ్మద్ ఘౌస్ కల. తండ్రి కల ఇప్పుడు నిజమైంది. కానీ అతని కలని ఇలలో చూసుకుని మురిసిపోయే క్షణం వరకు ఉంచకుండా దేవుడు తీస్కెళ్లిపోయాడు.గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మహ్మద్ ఘౌస్ (53) శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. అయితే.. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న మహ్మద్ సిరాజ్.. టీమ్ బయో- సెక్యూర్ బబుల్ నిబంధనల కారణంగా హైదరాబాద్‌కి వచ్చే అవకాశం లేకపోయింది. దాంతో.. తండ్రి కలని నెరవేర్చిన సిరాజ్.. చివరి చూపునకి నోచుకోలేకపోతున్నాడు. సిరాజ్ తన తండ్రిని చివరిగా ఈ ఏడాది ఆగస్టులో చూశాడు. ఐపీఎల్ 2020 సీజన్‌ కోసం యూఏఈకి బయల్దేరే ముందు తండ్రితో కొద్దిరోజులు గడిపిన సిరాజ్.. ఐపీఎల్ టైమ్‌లోనూ తరచూ ఫోన్ చేసి మాట్లాడటం మాత్రమే జరిగిందట.

ఈ నెల చివరి వారం నుండి జరగబోయే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కి ఎంపికైన మహ్మద్ సిరాజ్.. తుది జట్టులోకి ఎంపికయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాంతో.. అతని తండ్రి జీవించి ఉంటే ప్రతిష్ఠాత్మక సిరీస్‌లో భాగమైన కొడుకుని చూసి ఎక్కువగా సంతోషించి ఉండేవారు. ఇప్పుడు కూడా సిరాజ్.. ఆస్ట్రేలియా పర్యటన నుంచి హైదరాబాద్‌కి రావొచ్చు. కానీ.. ఒక్కసారి బయో- సెక్యూర్ బబుల్‌ని ఆటగాడు దాటి వెలుపలికి వచ్చిన తర్వాత మళ్లీ అందులోకి వెళ్లాలంటే.. 14 రోజులు క్వారంటైన్, మూడు సార్లు కరోనా వైరస్ పరీక్షలు తప్పనిసరి. దాంతో తండ్రి కలని నెరవేర్చే క్రమంలో ఉన్న మహ్మద్ సిరాజ్ చివరి చూపునకి నోచుకోలేకపోయాడు.